Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.కేశవ్‌ ఇంటికి వచ్చి గొడవ చేసిన శైలూ అన్న సురేశ్‌కు చక్రి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత చక్రి,మహా ఇద్దరూ కలిసి విడాకుల కోసం లాయర్‌ను కలుస్తారు. ఎలాంటి కారణంలేకుండా విడాకులు ఇప్పించడం కుదరదని చెప్పగా....ఏదోలా ఇప్పించాలని మహా కోరడంతో లాయర్‌ సరేనంటాడు. అటు సురేశ్‌ ఇంటికి వచ్చి గొడవ చేశాడని తెలుసుకున్న కేశవ్ కోపంతో రగిలిపోతాడు. చక్రిని తీసుకుని శైలూ వాళ్ల ఇంటికి వెళ్తాడు.
సురేశ్‌ గొడవ-బుద్ధిచెప్పిన చక్రి
కేశవ్‌ తన చెల్లిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన ఫ్రెండ్స్‌తో సురేశ్ కేశవ్‌ ఇంటికి వెళ్లి గొడవ చేస్తాడు. అప్పుడే కేశవ్‌ ప్రేమలో ఉన్నాడని తెలుసుకుని నారాయణ చాలా సంతోషపడతాడు. మా ఇంటికి మళ్లీ ఇంకో కోడలు రాబోతుందని ఆనందపడిపోతాడు. మాధవ్‌కు ఏం అర్థంగాక చక్రిని అడగ్గా....కేశవ్‌ ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని చెబుతాడు. వాళ్ల అన్నే వీడు అనుకుంటా అని అంటాడు.మావాడు మీ చెల్లి వెంటపడలేదని....మీ చెల్లి మా వాడి షాపు చుట్టూ తిరుగుతుందని చక్రి చెబుతాడు. వెళ్లి మీ పెద్దవాళ్లను తీసుకుని రమ్మని మర్యాదగా చెప్పినా వాడు వినడు. కేశవ్‌ గురించి, ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడటంతో చక్రి వాడిని కొట్టబోగా....మాధవ్ అడ్డుకుని పంపించేస్తాడు.
లాయర్‌ను కలిసి చక్రి, మహా
విడాకుల కోసం మహా,చక్రి ఇద్దరూ కలసి లాయర్ వద్దకు వెళ్లారు. విడాకులు ఎందుకు తీసుకోవాలని అడిగితే కారణం ఏంలేదని చెబుతారు. ఇద్దరూ ఒకేచోట ఉంటే కారణం చెప్పడం లేదని...లాయర్‌ చక్రిని బయటకు పంపించి మహాను అడుగుతాడు. మీ భర్త ఏమైనా కొడుతున్నాడా,తిడుతున్నాడా, టార్చర్ చేస్తున్నాడా అని ఆరా తీస్తాడు.అలాంటిదేమీ లేదని అతను చాలా మంచివాడని చెబుతుంది.మరి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే....అవన్నీ ఏం లేవని మాకు అనుకోకుండా పెళ్లి జరిగిందని అందుకే విడిపోదామని అనుకుంటున్నామని చెబుతుంది. అయితే నువ్వు బయటకు వెళ్లి మీ భర్తను పంపించమని చెబుతాడు. చక్రి వచ్చి విడాకులు ఎందుకు కావాలని అడగ్గా...నాకు అవసరం లేదని తనకు మాత్రమే కావాలని చెబుతాడు. దీంతో లాయర్‌కు విషయం అర్థమవుతుంది.ఇద్దరినీ పిలిచి కాగితాలపై సంతకాలు తీసుకుని మళ్లీ నేను పిలిచినప్పుడు రమ్మని పంపిస్తాడు.
కోపంతో రగిలిపోయిన కేశవ్
ఉదయం గొడవ జరిగిన సంగతి కేశవ్‌కు ఎవరూ చెప్పొద్దని...వాడు అసలే కోపంతో వెళ్లి గొడవ పెట్టుకుంటాడని మాధవ్ చెబుతాడు.ఇంతలో బయట నుంచి వచ్చిన కేశవ్‌...ఏం జరిగిందని అడగ్గా ఏం లేదని అందరూ చెబుతారు. ఇంతలో నారాయణ అక్కడికి వచ్చి కొడుక్కి కంగ్రాట్స్‌ చెబుతాడు. ఎందుకని అడిగితే...నువ్వు ఓ అమ్మాయిని ప్రేమించావు కదా అని అంటాడు.ఆ విషయం నీకు ఎలా తెలిసిందని అడిగితే....నాకు ఏంటిరా ఇక్కడ అందరికీ తెలుసుకదా అని అంటాడు. ఉదయం ఆ అమ్మాయి వాళ్ల అన్న వచ్చి గొడవ చేశాడు కదా...మన ఇంటిని,నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు కదా అని చెబుతాడు. దీంతో కేశవ్‌ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే శైలూ ఫోన్ చేయగా...వాళ్ల అన్న చేసిన రచ్చ గురించి చెప్పి కోపంతో తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో శైలూ వాళ్ల అమ్మ వరాలు దగ్గరకు వెళ్లి అరుస్తుంది. నీ కొడుకు ఆ ఇంటి దగ్గరకు ఎందుకు వెళ్లాడని నిలదీస్తుంది. ఇంకొకసారి అక్కడికి వెళ్లొద్దని హెచ్చరిస్తుంది. దీంతో వాళ్ల అమ్మ నిన్ను వాడితో మాట్లాడొద్దని చెప్పినా ఎందుకు మాట్లాడుతున్నావని కోప్పడగా...నా ఇష్టమని చెప్పడంతో చెంప పగులగొడుతుంది. ఉదయం కేశవ్‌,చక్రిని తీసుకుని శైలూ ఇంటికి వెళ్లగా...అక్కడ ఈ బండోళ్లు ఏం గొడవ చేస్తారేమోనని మాధవ్ ఆందోళన చెందుతుంటాడు.