Make In India Luxury Watch: జీ7 సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణికట్టుపై మెరిసిన ఒక స్వదేశీ వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ధరించిన జైపూర్ వాచ్ కంపెనీ కి చెందిన బాఘ్ టైమ్‌పీస్.. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. మేక్ ఇన్ ఇండియా కు, భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ లగ్జరీ వాచ్ కథనం అంతర్జాతీయ స్థాయిలో మన దేశీ బ్రాండ్ ఖ్యాతిని చాటిచెబుతోంది.

1947 నాటి రూపాయి బిళ్ల.. ‘బాఘ్’ కలెక్షన్ ప్రత్యేకత!

ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన ఈ వాచ్ సాధారణమైనది కాదు; దీని వెనుక భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర దాగి ఉంది. జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన సిగ్నేచర్ బాఘ్ కలెక్షన్‌లో భాగంగా రూపొందించిన ఈ వాచ్ డయల్‌లో.. బ్రిటిష్ ఇండియా చివరి సంవత్సరమైన 1947 నాటి అసలైన ఒక రూపాయి నాణేన్ని ఉపయోగించారు. ఈ నాణెంపై గంభీరంగా నడుస్తున్న పులి బొమ్మతో పాటు ONE RUPEE INDIA 1947 అనే అక్షరాలు ఉంటాయి. భారతదేశ చరిత్రను, ఆధునిక మెకానికల్ వాచ్ మేకింగ్ టెక్నాలజీతో జపనీస్ మియోటా ఆటోమేటిక్ మూవ్‌మెంట్‌ మిళితం చేసి సుమారు రూ. 60,000 ధర పరిధిలో అందించే ఈ యాక్సెస్బుల్ లగ్జరీ టైమ్‌పీస్ ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పై భారతీయ గర్వానికి చిహ్నంగా నిలిచింది.

Global stage, Indian story. The Baagh watch carrying a piece of India's past while representing its growing luxury sector today. #JaipurWatchCompanyAtG7 @JaipurWatchCo pic.twitter.com/OoHUWTw8zN

— Versha Singh (@Vershasingh26) June 20, 2026

కారు అమ్ముకుని మొదలుపెట్టిన గౌరవ్ మెహతా ప్రస్థానం!

ఈ అద్భుత బ్రాండ్ వెనుక ఒక మొదటి తరం పారిశ్రామికవేత్త పట్టుదల ఉంది. చిన్నప్పటి నుండి పాత నాణేలు, స్టాంపులను సేకరించే అలవాటున్న గౌరవ్ మెహతా అనే యువకుడు.. 2013లో రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జైపూర్ వాచ్ కంపెనీ ని స్థాపించారు. స్విస్ వాచీల హవా నడుస్తున్న మార్కెట్లో భారతదేశపు మొట్టమొదటి బెస్పోక్ లగ్జరీ వాచ్ మైక్రోబ్రాండ్‌ను నిర్మించాలనేది ఆయన కల. ప్రారంభంలో పెట్టుబడుల కోసం, బ్రాండ్ మార్కెటింగ్ కోసం గౌరవ్ తన సొంత కారును కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దేశీయంగా లగ్జరీ వాచ్ తయారీ రంగానికి మద్దతు లేకపోయినా, పట్టుదలతో జైపూర్‌లోనే డిజైన్, అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసి బ్రాండ్‌ను నిలబెట్టారు.

బ్రాండ్ ఫిలాసఫీ ప్రత్యేకం!

ఒక టైమ్‌పీస్ అనేది కేవలం సమయాన్ని చూపించేది కాదు.. అది చరిత్రను భద్రపరిచేది కావాలి అనేదే ఈ కంపెనీ ప్రధాన సిద్ధాంతం. కేవలం విదేశీ డిజైన్లను కాపీ కొట్టకుండా.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పాత నాణేలు, రాచరికపు ముద్రలు, పోస్టల్ స్టాంపులు, పిచ్వాయ్ సాంప్రదాయ చిత్రకళను వాచీల డయల్స్‌లో పొందుపరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరైనా కస్టమర్లు తమ పూర్వీకుల నాణేలు లేదా మోనోగ్రామ్‌లను ఇస్తే.. వాటిని రాబోయే తరాలకు గుర్తుండిపోయేలా అమూల్యమైన చేతి గడియారాలుగా మార్చి ఇవ్వడం జైపూర్ వాచ్ కంపెనీ ప్రత్యేకత.

ఎడ్ షీరన్ నుండి మోదీ దాకా.. సెలబ్రిటీల ఫేవరెట్!

గడిచిన 13 ఏళ్లలో ఈ బ్రాండ్ మంచి వృద్ధిని సాధించింది. అంతర్జాతీయ పాప్ సింగర్ ఎడ్ షీరన్ సైతం ఖరీదైన స్విస్ వాచీలను పక్కనబెట్టి జైపూర్ వాచ్ కంపెనీ వింటేజ్ కాయిన్ వాచ్‌ను ఎంపిక చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గతంలో ఒక ఏఐ సదస్సులో కూడా ప్రధాని మోదీ ఈ వాచ్‌తో కనిపించగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్న జీ7 సదస్సులో దీనిని ధరించడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ గ్లోబల్ లగ్జరీ మార్కెట్లో హాట్ కేక్‌లా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 కి పైగా స్టోర్లతో ఓమ్నీచానెల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఈ సంస్థ.. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి రూ. 40 కోట్లకు పైగా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతోంది.

వోకల్ ఫర్ లోకల్.. స్వదేశీ లగ్జరీకి కొత్త నిర్వచనం!

ఒకప్పుడు లగ్జరీ వాచ్ అంటే కేవలం స్విట్జర్లాండ్ బ్రాండ్ల వైపే చూసే భారతీయులకు.. జైపూర్ వాచ్ కంపెనీ వోకల్ ఫర్ లోకల్ నినాదంతో కొత్త ఆప్షన్‌ను పరిచయం చేసింది. జైపూర్ వీధుల్లో నాణేలతో ఆడుకునే ఒక చిన్న పిల్లాడి ఆలోచన నుండి పుట్టిన బ్రాండ్.. నేడు దేశ ప్రధాని చేతికి చేరి అంతర్జాతీయ దౌత్య వేదికలపై మెరవడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ పరిణామం. సాంప్రదాయ కథనాలకు, హస్తకళలకు సరైన ప్రాధాన్యత ఇస్తే అంతర్జాతీయ మార్కెట్లను కొల్లగొట్టవచ్చని గౌరవ్ మెహతా సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.