Pawan Kalyan Harihara Veeramallu Schedule May Be Late: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక గురించి 'హరిహర వీరమల్లు', 'ఓజీ' మూవీ సెట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. కానీ ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయడానికి ఎంత ట్రై చేసినా, తరచుగా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్ రావడంతో, ఈ సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్‌కి వైరల్ ఫీవర్
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైగ్రేడ్ వైరల్ ఫీవర్‌తో, తీవ్రమైన స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ వైరల్ ఫీవర్ కారణంగా పనులన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోబోతున్నారు. కాబట్టి మరికొన్ని రోజులు ఆయన సినిమాలకు దూరంగా ఉంటారని అంటున్నారు. గురువారం జరగనున్న ఏపీ క్యాబినెట్ సమావేశానికి కూడా ఆయన ఫీవర్ కారణంగా హాజరు కావట్లేదని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, డాక్టర్లు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన త్వరగా ఫీవర్ నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

'హరిహర వీరమల్లు' మరింత ఆలస్యం
పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురి కావడంతో, చాలాకాలంగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' మరోసారి లేట్ కాబోతోంది. హిస్టారికల్ డ్రామా 'హరిహర వీరమల్లు' షూటింగ్ చివరి దశకు చేరుకోగా, తాజాగా ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. మరో రెండు రోజుల్లో పవన్ 'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్‌లో చేరాల్సి ఉంది. కానీ ఇప్పుడు పవన్‌కు ఫీవర్ రావడం వల్ల ఇది జరిగేలా కనిపించట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్ సినిమాలో చాలా కీలకమైనదని సమాచారం. ఈ షెడ్యూల్లోనే పవన్‌పై కొన్ని ముఖ్యమైన ఛాలెంజింగ్ సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ కు విశ్రాంతి అవసరం. ఈ నేపథ్యంలోనే 'హరిహర వీరమల్లు' మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

నిజానికి ఈ మూవీ అనుకన్న టైమ్‌కు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలా వరకు వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్‌లో ఉండడంతో 'హరిహర వీరమల్లు' కంటే ముందు 'ఓజీ' రిలీజ్ కానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాగా 'హరి హర వీరమల్లు' మూవీని ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు, ఏఎం జ్యోతీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ బాబి డియోల్, నర్గీస్ ఫక్రీ, నిధి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: FIFA : 'ఫిఫా వరల్డ్ కప్' పోస్ట్ లో 'నాటు' రిఫరెన్స్ - ఎన్టీఆర్ ఎపిక్ రియాక్షన్