Tiger Death in Markapuram District | అమరావతి: మార్కాపురం జిల్లా రాచర్ల బీట్ పరిధిలో వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి మృతిచెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ అటవీశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం అన్నారు. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయమని, మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోందన్నారు.

‘నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి చనిపోవడం నా దృష్టికి వచ్చింది. ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించాను. అది సహజ మరణమా? లేక వేటగాళ్లు చేసిందా, విషప్రయోగం వంటి ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి పులి మరణానికి గల కారణాన్ని నిర్ధారించాలని’ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతం నా దృష్టికి వచ్చింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన…

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 1, 2026

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచడంతో పాటు, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ సంపదను, ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని పేర్కొన్న ఆయన... కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పులి మృతి ఘటనలో బాధ్యులు ఎవరన్నది తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.