Pawan Kalyan On Panchadarla Land Issue: అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. పంచదార్ల కొండ తవ్వకాల్లో అక్రమాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు తేల్చారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించాలని సూచించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మైనింగ్ కారణంగా పంచదార్ల కొండ దిగువన ఉన్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జలధారల రంగు మార్పుపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, మూలాలను పరిశీలించి, సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై జరిమానాతోపాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదే సమయంలో పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని పవన్‌ తెలిపారు. పంచదార్ల కొండ వద్ద ఉన్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్‌మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.