Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లను ప్రకటించింది. ఇందులో గాయకుడు భేరు సింగ్ చౌహాన్, భీమ్ సింగ్ భవేష్, అథ్లెట్ హర్విందర్ సింగ్, డాక్టర్ నీర్జా భట్ల మరియు కువైట్ యోగా ట్రైనర్ షేఖా ఏజే అల్ సబాహా వంటి పలువురు ప్రముఖులున్నారు. సాధారణంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాల్లో అందిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ప్రారంభంలో వీటిని వేరే పేర్లతో పిలిచేవారు. ఆ పేర్లతోనే అవార్డులు అందించేవారు. అయితే ఈ పేర్లను ఎప్పుడు మార్చారు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1954 నుంచి మొదలు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం 1954 నుంచి భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్నుంచి వివిధ రంగాల్లో అద్భుతమైన, విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తున్నారు. కళ, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. అనంతరం ఆ ఏడాదిలో వచ్చే మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో వారికి అవార్డులను అందిస్తారు.

ప్రారంభంలో ప్రతిపాదించిన పేర్లు ఇవే

1954లో పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు కేవలం దాన్ని పద్మవిభూషణ్ పేరుతో మాత్రమే పురస్కారాలను అందించేవారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అనే మూడు కేటగిరీలు ఉండేవి. కానీ ఈ పేర్లు కేవలం సంవత్సరం వరకే కొనసాగాయి. ఆ తర్వాత జనవరి 8, 1955న రాష్ట్రపతి భవన్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఈ అవార్డుల పేర్లను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చారు. అప్పట్నుంచి ఈ పేర్లు వాడుకలోకి వచ్చాయి.

పద్మ అవార్డుల్లో కీలక నిబంధనలు

పద్మ అవార్డులు అందుకున్న వారు మరో 5ఏళ్ల పాటు మరే ఇతర పద్మ అవార్డును అందుకోలేరు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ఒకరికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు వస్తే.. అతను మరో 5 ఏళ్ల తర్వాతే పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్‌కు అర్హులుగా భావిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఆయా పరిస్థితులకు అనుగుణంగా నియమాలను మార్చే అవకాశం కూడా ఉంటుంది.

ఈ ఏడాది పద్మ అవార్డులు వరించింది వీళ్లనే

కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. అందులో భాగంగా ఏడుగురికి పద్మ విభూషణ్, 19మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మ శ్రీ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపింది. వీరిలో వైద్య విభాగంలో సేవలందించిన తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ వరించగా, కళల విభాగంలో ఏపీకి చెందిన సినీ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైనారు.

Also Read : Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..