Pawan Kalyan's They Call Him OG Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడింది. 'ఓజీ' థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? ఫ్యాన్ బాయ్ సుజీత్ అభిమానులను మెప్పించే సినిమా తీశాడా? ప్రేక్షకులు అందరితో క్లాప్స్ కొట్టించే సినిమా తీశాడా? రివ్యూలో తెలుసుకోండి.

కథ (OG Movie Story): సత్య దాదా (ప్రకాష్ రాజ్) కనుసన్నలలో ముంబైలోని కొలాబా పోర్టు ఉంటుంది. అనుకోకుండా అక్కడికి ఓ కంటైనర్ వస్తుంది. దాని కోసం మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) కుమారుడు జిమ్మీ (సుదేవ్ నాయర్) వస్తాడు. అయితే... కంటైనర్ తీసుకు వెళ్లకుండా అడ్డుకున్న సత్య దాదా కొడుకు (వెంకట్)ను జిమ్మీ చంపేస్తాడు. కంటైనర్‌లో ఆర్‌డిఎక్స్‌ గురించి తెలిసిన సత్య దాదా వాళ్ళ కంట పడకుండా దాచేస్తాడు.

కంటైనర్, అందులో ఉన్న ఆర్‌డిఎక్స్‌ కోసం ఇస్తాంబుల్ నుంచి మిరాజ్ కర్ పెద్ద కొడుకు ఓమీ (ఇమ్రాన్ హష్మీ) వస్తాడు. సత్య దాదా కుటుంబంపై ఎటాక్ చేస్తాడు. అప్పుడు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ముంబైలో అడుగు పెడతాడు.

కన్న కొడుకులు ఇద్దరితో పాటు సమానంగా ఓజీని కూడా సొంత కొడుకులా సత్య దాదా చూస్తాడు. అటువంటి వ్యక్తిని వదిలేసి ఓజీ ఎందుకు దూరంగా వెళ్ళాడు? సత్య దాదా పెద్ద కోడలు గీత (శ్రియా రెడ్డి), ఆమె కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) ఏం చేశారు? ఓజాస్ గంభీర భార్య కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) పాత్ర ఏమిటి? స్నేహితులైన సత్య దాదా, మిరాజ్ కర్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? ఓమీని అడ్డుకుని సత్య దాదా కుటుంబాన్ని ఓజీ ఎలా కాపాడాడు? ఏం కోల్పోయాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (OG Review Telugu): పవన్ కళ్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? అనేది ఆయనకు బాగా తెలుసు. పవన్‌ కళ్యాణ్‌ను ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుంది? అనేది ఆయనకు ఐడియా ఉంది. దర్శకుడిగా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ తీసిన అనుభవం ఉంది. స్టైల్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే, అభిమానులకు నచ్చే సీన్స్ రాసుకున్నారు. సుజీత్ కథలో కొత్త అంశాలు లేవు. మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలు చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులకు కథ కొత్తగా ఉండదు.

కథ కంటే కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద దర్శకుడు సుజీత్ ఎక్కువ ఆధారపడ్డారు. ఆయనలో దర్శకుడి కంటే అభిమాని ఎక్కువ బయటకు వచ్చాడు. దాంతో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అయ్యింది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సీన్ అభిమానులకు 'హై' ఇస్తుంది. అందులో 'నో' డౌట్. కానీ, కథ పరంగా డిజప్పాయింట్ చేశాడు సుజీత్.

పవన్ కళ్యాణ్ స్టైల్, 'ఓజీ'గా పవర్ స్టార్‌ను సుజీత్ ప్రజెంట్ చేసిన తీరు ముందు 'ఓజీ' కథ చిన్నబోయాయి. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ ముందు ఎమోషన్ అసలు కనిపించలేదు. జపాన్‌లో కథ ప్రారంభమైనప్పటి నుంచి ముంబైలో హీరో ఇంట్రో వరకు తెరపై పవన్ ఎప్పుడొస్తారు? అని ఎదురు చూసేలా చేసిన సుజీత్... పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ కళ్లు చెదిరేలా తీశారు. ఆ ఎలివేషన్ మామూలుగా లేదు. అదొక్కటే కాదు... అక్కడ నుంచి పవన్ యాక్షన్ చేసిన ప్రతిసారీ 'హై' వస్తుంది.

ప్రియాంక అరుల్ మోహన్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ కథ అంతగా ఆకట్టుకోలేదు. కానీ, ఇంటర్వెల్ ఆ ప్రేమ కథను మర్చిపోయేలా చేసింది. పవన్ కెరీర్ బెస్ట్ యాక్షన్ సీన్, ఎలివేషన్ ఇచ్చారు సుజీత్. ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కూడా గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పాలి. అయితే ఆ తర్వాత అర్జున్ దాస్ - శ్రియా రెడ్డి ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ కథలో వేగాన్ని తగ్గించింది. క్లైమాక్స్ హడావిడిగా ముగిసినట్టు అనిపిస్తుంది. 'హై' ఇచ్చిన ఇంటర్వెల్ తర్వాత అంతకు మించి 'హై' ఇచ్చే యాక్షన్ / ఎమోషన్ ఉన్నప్పుడు థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందుతారు. ఆ విషయంలోనూ సుజీత్ డిజప్పాయింట్ చేశారు. నేటివిటీ కోసం జపనీస్, తమిళ్, మరాఠీ డైలాగులు రాశారు. సామాన్య ప్రేక్షకులు అందరికీ అర్థం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోలేదు. 'వాషి యో వాషి' హైకూకు తెలుగు సబ్ టైటిల్స్ కూడా వేయలేదు.

'ఓజీ' ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో తమన్. కొత్త తమన్ వినిపించారు. సుజీత్ రాసిన ప్రతి సీన్ & ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ చేసేలా ఆర్ఆర్ ఇచ్చారు. కెమెరా వర్క్ బావుంది. నిర్మాత డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి చేసిన ఖర్చు తెరపై కనిపించింది. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్ ఉన్న చిత్రమిది.

పవన్ కళ్యాణ్ కళ్ళల్లో పొగరు ఉంటుంది. మాఫియా కథల్లో గన్ను పట్టినప్పుడు ఆ పవర్ మరింత ప్రకాశిస్తుంది. 'ఓజీ'లో అది కనిపిస్తుంది. కటానా పట్టిన సన్నివేశాలు లేదంటే ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారంటే కారణం ఆ కళ్ళే. ఓజాస్ గంభీర పాత్రలో పవన్ పూర్తిగా లీనం అయ్యారు. దాంతో నటుడిగా అభిమానులకు మరింత నచ్చుతారు. ఆయన స్టైలింగ్ విషయంలో సుజీత్ కేర్ తీసుకోవడంతో ప్రతి సన్నివేశంలో 'ది బెస్ట్ లుక్' కనిపించింది. పవన్ ముందు ఇమ్రాన్ హష్మీ బలంగా నిలబడ్డారు. హీరోకి ధీటుగా స్టైలిష్‌గా ఆయన కనిపించారు, నటించారు.

Also Read: దక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. ప్రకాష్ రాజ్ మరోసారి నటనలో, డైలాగ్ డెలివరీలో అనుభవం చూపించారు. హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రూ, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, 'కిక్' శ్యామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చేశారు. అర్జున్ దాస్ గొంతులోని గాంభీర్యం మరోసారి నటనను ఎలివేట్ చేసింది. శ్రియా రెడ్డి నటన ఆకట్టుకుంటుంది. రాహుల్ రవీంద్రన్, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్ అతిథి పాత్రల్లో మెరిశారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వీరాభిమాని తీసిన సినిమా 'ఓజీ'. కథ - సినిమాగా చూస్తే రెగ్యులర్ యాక్షన్ ఫిల్మ్. రోలర్ కోస్టర్ రైడ్. యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిజం ఎలివేట్ అయినంతగా ఎమోషన్స్ కాలేదు. కానీ... పవన్ కెరీర్ బెస్ట్ లుక్స్, యాక్షన్ సీన్స్, ప్రజెంటేషన్ ఉన్న సినిమా 'ఓజీ'. పవన్ అభిమానులకు సినిమా నచ్చుతుంది. హ్యాపీగా థియేటర్లకు వెళ్ళవచ్చు. యాక్షన్ లవర్స్‌కు ధమాకా.

Also Read: 'ఘాటీ' రివ్యూ: క్రిష్ నుంచి పుష్ప, దసరా రేంజ్‌ రస్టిక్ యాక్షన్‌... అనుష్క సినిమా హిట్టా? ఫట్టా?