Shahid Kapoor's O Romeo Movie Telugu Review : బాలీవుడ్ లెజెండ్ షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'ఓ రోమియో' (O Romeo). విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' బుక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించగా రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలో షాహిద్ 'ఉస్త్రా' రోల్ పోషించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూస్తే...

కథ ఏంటంటే?

ఈ కథను అండర్ వరల్డ్ నేపథ్యంగా తీశారు. 'రోమియోతో ప్రేమ పుడుతుంది… జూలియట్ కూడా తక్కువ కాదు…'... ఈ లైన్ మనల్ని నేరుగా ఓంకారా సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ప్రేమ, శక్తి, రాజకీయాలు ఒకేసారి ఢీకొంటాయి. 1995 సంవత్సరం ముంబైలో ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. గ్యాంగ్ స్టర్ ఉస్త్రా (షాహిద్ కపూర్) ఇంటెలిజెన్స్ బ్యూరో కోసం వర్క్ చేస్తుంటాడు. బ్యూరో హెడ్ ఖాన్ అతనితో ఇతర గ్యాంగ్‌స్టర్లను చంపించే పనులు చేయిస్తాడు. ఈ సమయంలో అఫ్సా ఖురేషీ (త్రిప్తి డిమ్రి) నలుగురిని చంపించేందుకు సుపారీతో అతని దగ్గరకు వస్తుంది. ఆ సుపారీ ఎవరి మీద? ఉస్త్రా ఆ ఆఫర్‌ను అంగీకరిస్తాడా లేదా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

సినిమా ప్రారంభంలో షాహిద్ కపూర్ రోల్ హీరో అని చెప్పే క్షణం నుంచే సినిమా టోన్ సెట్ అవుతుంది. హీరో నుంచి విలన్ వరకు విశాల్ భరద్వాజ్ సృష్టించిన ఈ పాత్రలు ఎలా సంచలనం సృష్టించబోతున్నాయో ఇంట్రోలోనే అద్భుతంగా చూపించారు. రచయిత హుసైన్ జైదీ రాసిన 'Queens of Mumbai' పుస్తకంలోని హుసైన్ ఉస్త్రా, సప్నా దీది కథల నుంచి ప్రేరణ పొంది దీన్ని సినిమాగా మలిచారు.

విశాల్ భారద్వాజ్, షాహిద్ కపూర్ కలిసి వస్తే అద్భుతం చేస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ కనిపిస్తుంది. ప్రేమకథలు చాలా చూసి ఉంటారు, కానీ ఒక గ్యాంగ్‌స్టర్ ప్రేమకథలో అతను సరిహద్దులు దాటి వెళ్లడం, మరణాన్ని తాకి తిరిగి రావడం వంటి అంశాలు కొత్త అనుభూతిని ఇస్తాయి. ప్రతి పాత్ర కూడా ‘గ్రే’ షేడ్‌లో ఉన్నా కూడా వాళ్లపై నెగిటివిటీ రాదు.

సినిమా కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ భారీ స్థాయిలో రూపొందించబడ్డాయి. ఇవన్నీ కలిసి సినిమాను ‘లార్జర్ దెన్ లైఫ్’గా నిలబెడతాయి. క్లైమాక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది — ఇద్దరు ప్రేమికులు కలిసి గన్స్ పట్టుకుని పోరాడే సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు పంజాబీ పాటలపై హీరో యాక్షన్ చేసే సన్నివేశాలు పెద్ద తెరపై చూశాం. కానీ సినిమా ప్రారంభంలో షాహిద్ పాత్ర ‘ఉస్త్రా’ Dhak Dhak Karne Laga పాటకు తన ఉస్త్రాతో 50 నుంచి 100 మందిని చిత్తు చేయడం మాత్రం భిన్నంగా, ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే 90ల హిట్ పాటలు Ae Mere Humsafar మరియు Dil Hai Ke Manta Nahinలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో తెలివిగా ఉపయోగించడం సినిమాకు మరింత నాస్టాల్జియా టచ్‌ను ఇస్తుంది.

Also Read : 'ఫంకీ' రివ్యూ: విశ్వక్ సేన్ సినిమా హిట్టా? ఫట్టా? అనుదీప్ కేవీ సినిమా ఎలా ఉందంటే?

ఎవరెలా చేశారంటే?

షాహిద్ కపూర్ ఒక ప్రతిభావంతమైన నటుడు. కానీ ఆయనలో దాగి ఉన్న డ్రామాను అత్యుత్తమంగా వెలికి తీయగల వ్యక్తి విశాల్ భారద్వాజ్. హైదర్, కమీనే వంటి సినిమాల తర్వాత ఈ చిత్రంలో కూడా షాహిద్ తన నటనలో ఎన్నో షేడ్స్ చూపించారు. ఆయన ఒకేసారి రొమియోలా, గ్యాంగ్‌స్టర్‌లా, అలాగే అద్భుతమైన నటుడిలా కనిపిస్తారు. తృప్తి డిమ్రీని ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల కంటే డిఫరెంట్‌గా చూపించారు.

నానా పాటేకర్, ఫరీదా జలాల్, అరుణా ఇరానీ చిన్న పాత్రల్లో కనిపించినా, తెరపై తమ తమ ముద్రను వేశారు. తమన్నా భాటియాకు మూడు నాలుగు సీన్లు మాత్రమే ఉన్నా, వాటిలో ఆమెకు నటన చూపించే మంచి అవకాశం లభించింది. ట్రైలర్ లాంచ్‌లో అవినాష్ తివారి “ఈసారి నన్ను గుర్తుపెట్టుకుంటారు” అన్నారు. నిజంగానే ఆయన చేసిన నటన మరచిపోలేనిది. జూలీ పాత్రలో దిశా పటాని గుర్తుండిపోతారు. ఇన్‌స్పెక్టర్ పఠారే పాత్రలో నటుడు రాహుల్ దేశ్‌పాండే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్‌లా నిలుస్తారు. చిన్న పాత్ర ‘ఛోటు’లో హుసైన్ దలాల్ మంచి నటన చూపించారు.

మొత్తంగా, వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక ఇన్‌టెన్స్ లవ్ స్టోరీతో పాటు అద్భుతమైన నటన చూడాలనుకుంటే ఈ సినిమాను తప్పక చూడవచ్చు.

రేటింగ్ - 4/5