Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున అత్తామామల మాటలు తలచుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక దేవా తండ్రి మాటలు తలచుకొని మందు తాగుతాడు. సూర్యకాంతం త్రిపురకు వీడియో కాల్ చేస్తుంది. ఈ తింగరి నాకు వీడియో కాల్ చేసిందేంటని త్రిపుర అనుకొని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు కాల్ చేశావ్ అంటే మీరు ఇచ్చిన ఫోన్ పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేశానంటే నీలా అది డూప్లికేట్ కాదని త్రిపుర కాంతాన్ని తిడుతుంది. ఇక సూర్యకాంతం ఇంట్లో జరిగిన విషయం మొత్తం త్రిపురకు చెప్తుంది. మీ మరదలు పది లక్షలు ఇవ్వడంతో మామయ్య దేవాని తిట్టారని చెప్తుంది. ఇంతలో కాంతానికి శారద పిలవడంతో కాల్ కట్ చేసేస్తుంది. మిధునకు పది లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయని త్రిపుర ఆలోచిస్తుంది.

మిధున: నేను మా అమ్మావాళ్ల ఇంటికి వెళ్తున్నాను నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేయండి.
దేవా: ఏ.. ఏ.. ఏమన్నావ్ నేను షాక్‌లో ఉన్నాను సరిగా వినిపించలేదు. నువ్వు అన్నది నేను విన్నానా నాకు మరోలా వినిపించిందా అర్థం కావడం లేదు. ఏం అనుకోకుండా మరోసారి చెప్పవా ప్లీజ్.
మిధున: నేను మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలి డ్రాప్ చేయ్.
దేవా: ఏయ్ ఇది నిజమే.. చెవులకు ఇంత శ్రవణానందకరంగా ఉంది. మనసు గాల్లో తేలిపోతుంది. ఈ మధ్య ఇంత ఆనందంగా ఎప్పుడూ లేదు. అదిరిపోయే న్యూస్ చెప్పావని దేవా మిధున చుట్టూ తిరుగుతూ తీన్ మార్ డ్యాన్స్ చేస్తాడు. ఇది మొన్నటిలాగా ఆటోలో తిరిగి వచ్చి చీపురుతో షాక్ ఇచ్చేలా మళ్లీ షాక్ ఇవ్వవుగా. అయినా నేను రానివ్వనులే. నీలో ఇంత జ్ఞానోదయం రావడానికి కారణం ఏంటి.

మిధున పుట్టింట్లో అందరూ హరివర్దన్ పుట్టిన రోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటారు. అక్క లేకుండా చేస్తున్న నాన్న మొదటి పుట్టిన రోజు అని మిధున చెల్లి అలంకృత త్రిపురతో చెప్పి బాధ పడుతుంది. అందరూ మిధున గురించి బాధ పడతారు. నాన్న మీద ప్రేమని భర్త్‌డేని ఎలా మిధున మర్చిపోయిందని నాకు మిధున నచ్చలేదని త్రిపుర అంటుంది. దానికి రాహుల్ మన కంటే ఆ రౌడీ కట్టిన తాళే ఎక్కువని వెళ్లిపోయిందని బాధ పడతాడు. ఇక హరివర్దన్ వచ్చి ఎందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు నేను ఇప్పుడు చనిపోయానని నేనో శవాన్ని అని బాధ పడతాడు. నా కూతురు నా ప్రాణం తీసుకొని వెళ్లిపోయిందని అంటాడు. నన్నో ప్రాణం లేని మనిషిగా వదిలేసి వెళ్లిపోయిందని అంటాడు. నా కూతురు నాతో లేకపోతే నాకు జీవితమే లేదని బాధ పడతారు. హరివర్దన్ మాటలకు అందరూ బాధ పడతారు. ఏర్పాట్లు ఆపేయమని చెప్పి హరి వర్దన్ వెళ్లిపోతాడు.

దేవా ఇంట్లో అందరిని పిలిస్తాడు. చాలా సంతోషంగా ఉందని మీ అందరితో పంచుకోవాలని పిలుస్తున్నానని అంటాడు. మన ఇంటికి వచ్చిన హోల్ సేల్ తల నొప్పి మనల్ని వదిలి పోతుందని అంటాడు. అర్థం కాలేదని శారద అంటే జడ్జిగారి అమ్మాయి మేడం మిధున మన ఇంటి నుంచి వెళ్లిపోతుందని గెంతులేస్తాడు.

సత్యమూర్తి: శారద ఏం జరుగుతుంది.
మిధున: వెళ్లొస్తాను.
దేవా: హలో వెళ్లొస్తా కాదు వెళ్తాను అని చెప్పాలి ఎందుకంటే నువ్వు శాశ్వతంగా మమల్ని వదిలి పోతున్నావ్ మరి జన్మలో మా ఇంటికి రావొద్దు.
శారద: అమ్మా నువ్వు గుడిలో నుంచి ప్రసాదం తీసుకొచ్చి తిని అర్థాకలితో ఉంటుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించేది. ఆకలికి తట్టుకోలేక మీ ఇంటికి వెళ్లిపోతావని నీకు అన్నం పెట్టలేదు. నన్ను క్షమించమ్మా.
సత్యమూర్తి: మిధున ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావ్ అమ్మా. అమెరికాలో చదువుకున్న నువ్వు ఇలా జీవితం నాశనం చేసుకోకుండా ఇప్పటికైనా మీ నాన్న వాళ్లు చెప్పినట్లు వింటే నీకు మంచి జీవితం ఇస్తారమ్మా.
ప్రమోదిని: మిధున అక్కా అని నువ్వు నోరారా పిలిస్తే నా సొంత చెల్లిలా అనిపించావ్. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఫోన్ నెంబరు నా దగ్గర ఉంది కదా నేను మాట్లాడుతానులే.
కాంతం: ఏదో అప్పగింతలు ఇస్తున్నట్లు ఇదేంటి వెళ్లిపోవాలి అంటే గబగబా వెళ్లిపోవాలి.
దేవా: అవునవును.

మిధున అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. సత్యమూర్తి మిధునని చూస్తూ ఉండిపోతాడు. శారద ప్రేమగా మిధున తల నిమురుతుంది. దేవా సంతోషంగా ఉంటాడు. మిధున బాధ పడుతూ దేవా బండి ఎక్కుతుంది. సూర్యకాంతం త్రిపురకు కాల్ చేసి రెండు లక్షల రవ్వల నెక్లెస్ ఇవ్వమని అంటుంది. దాంతో త్రిపుర అరుస్తుంది. హ్యాపీ న్యూస్ చెప్తానని అంటుంది. మిధున మీ ఇంటికి బయల్దేరిందని సూర్యకాంతం చెప్పడంతో త్రిపుర సంబర పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!