Delhi NCR Fire Accident Latest News:  దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోని హైటెక్ సిటీ నోయిడాలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్ పరిధిలోని నోయిడా ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామూరా గ్రామంలోని ఒక ఐదు అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆ బహుళ అంతస్తుల భవనంలో దాదాపు 50 కుటుంబాలు చిక్కుకుపోవడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

భవనం కింద పార్క్ చేసి ఉంచిన ఒక ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి భారీగా విస్ఫోటనం చెందడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బైక్ నుండి ఎగసిపడిన మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ ఐదు అంతస్తులను కమ్మేయడంతో లోపల ఉన్న ప్రజలు ఊపిరాడక, బయటకు వచ్చే మార్గం లేక గదుల్లోనే బందీలయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఫేజ్-3 పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం చుట్టూ దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు మొదట్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే ఫైర్ ఫైటర్లు ప్రత్యేక రెస్క్యూ కిట్లు, క్రేన్ల సహాయంతో భవనం కిటికీలు, బాల్కనీల ద్వారా లోపలికి ప్రవేశించి.. తీవ్ర శ్రమకోర్చి దాదాపు 50 కుటుంబాలకు చెందిన వందలాది మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

A massive fire broke out in Mamura village, located in Noida—a high-tech city in Uttar Pradesh near Delhi. Two people died, and 50 families were trapped in the blaze.

Report @MdRaza_ #Noida #Fire #NoidaFire @noidapolice @DCP_Noida @dmgbnagar @CeoNoida @noida_authority pic.twitter.com/Tz9kFFjK8o

— SANJEEV CHAUHAN (@SanjeevCrime) July 15, 2026

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్నో నుంచి ఆయన నోయిడా జిల్లా యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసరంగా మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, జిల్లా కలెక్టర్ , డీసీపీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు.

హైటెక్ నగరంగా గుర్తింపు పొందిన నోయిడా పరిసర ప్రాంతాల్లోని ఇరుకైన భవనాల్లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస భవనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ ప్రమాదంపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.