<p>హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న మరిన్ని పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని పథకాలకు లబ్ధిదారుల జాబితాపై అదేరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయలేదని తెలిసిందే. తప్పులు, మార్పులు చేర్పులకు సైతం దశాబ్దకాలం నుంచి ప్రజలకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈనెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలకు లబ్దిదారుల ఎంపికపై రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. </p>
<p><br />ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఇదివరకే రూపొందించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేరు లేదని కొందరు, రేషన్ కార్డు లేదని లబ్దిదారుల జాబితాలో తమ పేరు చేర్చలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన లబ్దిదారులు కొత్త రేషన్ కార్డు కోసం ఈ గ్రామ సభలలో పాల్గొని తమ వివరాలతో దరఖాస్తు సమర్పించాలని మంత్రులు, అధికారులు సూచించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితలో పేర్లు లేకపోతే మంగళవారం నుంచి జరుగుతున్న గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. </p>