హైదరాబాద్: తెలంగాణలో నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి 89 శాతం మంది అభ్యర్థులు నీట్ యూజీ ఎగ్జామ్‌కు హాజరుకాగా, మే నేలలో హాజరైన వారితో పోల్చితే హాజరుశాతం 8.55 మేర తగ్గింది. తెలంగాణలో మొత్తం 24 పట్టణాల్లో 208 సెంటర్లలో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా పలుచోట్ల మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి అభ్యర్థులు అరెస్ట్ అయ్యారు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటన జరిగింది. హిజాబ్ ధరించిన ఓ యువతిని రాజస్తాన్ లోని అజ్మీర్‌లో ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించకపోవడం వివాదాస్పదమైంది.

హైదరాబాద్‌లోని ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాగన్నగూడ జడ్పీహెచ్‌ఎస్‌ (ZPHS) నీట్‌ ఎగ్జామ్ సెంటర్‌లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థి, పరీక్షలో కాపీ కొట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చాడు. అందరికంటే ముందుగానే ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకుని, ఎవరికీ తెలియకుండా ఒక జిప్‌లాక్‌ కవర్‌లో మొబైల్ ఫోన్‌ను ఉంచి, బాత్రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో దాచాడు. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో తనకు కడుపునొప్పి వస్తోందంటూ పర్మిషన్ తీసుకుని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు లోపలికి వెళ్లి చెక్ చేశారు. ఈ విద్యార్థి ప్లష్ ట్యాంక్ నుంచి ఫోన్ తీసి సమాధానాలు వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోదుస్తుల్లో సిమ్ కార్డుతో దొరికిన అభ్యర్థి
దేశవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్‌ రీఎగ్జామ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఒక విచిత్ర ఘటన జరిగింది. వారణాసిలోని హరిశ్చంద్ర పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. చెక్ చేస్తుండగా అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ క్రమంలో అతడి లోదుస్తుల్లో దాచి ఉంచిన ఒక సిమ్‌ కార్డు, అలాగే నీట్‌ ఎగ్జామ్ పాత ప్రశ్నపత్రం బయటపడ్డాయి. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ అభ్యర్థిని బలియా జిల్లాకు చెందిన ప్రిన్స్ దూబేగా గుర్తించారు. తాను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో నీట్‌ కోచింగ్ తీసుకున్నానని, పరీక్ష రాయడానికే ఇక్కడికి వచ్చానని తెలిపాడు.

బిహార్‌లో ముఠా అరెస్ట్ – ఒకరి బదులు మరొకరు

మరోవైపు బిహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో నీట్ పరీక్షలో భారీ అక్రమాలకు ప్రయత్నించారు. అసలైన అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది డమ్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు లఖిసరాయ్ జిల్లా ఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. బయోమెట్రిక్ తనిఖీల సమయంలో దొరికిన ఆధారాల బట్టి వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మాల్ ప్రాక్టీస్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న బయోమెట్రిక్ ఆపరేటర్లు, లీక్ సూత్రధారులు, మధ్యవర్తులు మరికొందర్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని విచారించారు. దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు నీట్ రీఎగ్జామ్‌కు హాజరయ్యారు.

మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ రాసిన ఎందరో అభ్యర్థులు ఆలస్యం కారణంగా ఆదివారం నిర్వహించిన నీట్ రీఎగ్జామ్‌ రాయలేకపోయారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించారు. ఒక్క నిమిషం, రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఎంతో మంది నీట్ ఎగ్జామ్ రాయలేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల హిజాబ్ సమస్యతో కొందరు అభ్యర్థుల్ని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. మే నెలలో అనుమతించి, ఇప్పుడు ఎలా అడ్డుకుంటారని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.