Chiranjeevi Speach Sparks Controversy: ఉగాది నాడు... తెలంగాణ చిత్ర పరిశ్రమ అవార్డుల వేడుక ‘గద్దర్ అవార్డ్స్’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగిన ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధులంతా వచ్చారు. 2025 సంవత్సరం ఉత్తమ చిత్రాలు, నటుల అవార్డులతో పాటు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ ప్రదానం చేశారు.

చిరు వ్యాఖ్యలు సన్సేషన్- Chiranjeevi comments on AP Government

ఈ అవార్డుల ప్రదానోత్సంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సందర్భమో.. అసందర్భమో తెలీదంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త కాక రేపాయి. “ తెలంగాణలో చిత్ర పరిశ్రమను బాగా గుర్తిస్తున్నారు.. పక్క రాష్ట్రమైనటువంటి మరో తెలుగురాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల వారిని ఉత్సాహ పరిచే విధానంలో కొంచం వెనుకంజలో ఉందని భావిస్తున్నాను. సినిమా వాళ్లకి దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక బాగుంటుంది.” అంటున్నారు. దీనిపై వెంటనే రియాక్షన్ వచ్చింది. చిరంజీవి స్థాయి వ్యక్తి.. పక్క రాష్ట్రంలో అవార్డుల ఇస్తున్న వేదికపై మాట్లాడటంతో అంతా దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

ఆర్‌.నారాయణమూర్తి ఫైర్
చిరంజీవి వ్యాఖ్యలే ఏపీకి కొంచం ఇబ్బందికరంగా మారితే.. మరో నటుడు ఆర్‌.నారాయణమూర్తి “చంద్రబాబు గారూ..తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించండి.. మీరు కూడా నంది అవార్డులు ఇవ్వండి” అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఇద్దరు ముఖ్యమైన నేతలు ఓ రాష్ట్రంలోని అవార్డుల వేదికపై నుంచి మరో రాష్ట్రం గురించి మాట్లాడటం ఆంధ్రప్రదేశ్‌ను ఇరుకున పెట్టినట్లైంది.

ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచం ప్రో యాక్టివ్‌గానే ఉండే వ్యక్తి. ఆయనకు సినిమా వాళ్లతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి బహిరంగంగా ఇలాంటి కామెంట్ చేయడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. చంద్రబాబు నేరుగా రియాక్ట్ కాకపోయినా ఆ శాఖ నుంచి స్పందన వస్తుందేమో అని సినిమా ఇండస్ట్రీ చూస్తోంది. తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా ఉన్న పవన్ కల్యాణ్ ఏపీలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌కు ఆయన సోదరుడే. అప్పట్లో ఇండస్ట్రీ విషయంలో ఉన్న గ్యాప్‌ను సరిచేయడానికి పవన్ కల్యాణ్ కూడా ప్రయత్నాలు చేశారు.

తెలుగు దేశం సోషల్ మీడియా కౌంటర్
చిరంజీవి వ్యాఖ్యలపై ఎవరూ అధికారికంగా రెస్పాండ్ అవ్వకపోయినా .. తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే సోషల్‌ మీడియా అకౌంట్లలో చిరంజీవి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం అవుతోంది. వాళ్లు లేవనెత్తుతున్న పాయింట్లు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి చిరంజీవి పక్క రాష్ట్రం అంటూ కామెంట్లు చేయడం ఏంటి.. ఆయన ఆంధ్రా వ్యక్తి కాదా అన్న ప్రశ్న వస్తోంది.

చిరంజీవి కేవలం నటుడే కాదు. ఆయనకు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఏపీ ఇండస్ట్రీ అభివృద్ధికి చిరంజీవి ఏమైనా కృషి చేశారా.. లేదా తన ఫౌండేషన్ ద్వారా ఏమైనా కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అది హైదరాబాద్ కే సంబంధించినదిగా ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. వాళ్లు ఆంధ్రాలో కనీసం సినిమా కార్యక్రమమైనా చేస్తున్నారా అని నిలదీశారు.

కిందటి ప్రభుత్వం లాగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు. ఇండస్ట్రీ నుంచి అడిగిన వెంటనే అన్ని సినిమాలకు రేట్లు పెంచతూ జీవోలు వచ్చాయి.

తెలంగాణలో కొన్ని సినిమాలకు టికెట్లు రేట్లు పెంచకుండా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే తెలంగాణతో సమానంగా ఇండస్ట్రీకి మేలు చేయడంలో ఏపీ వెనుకబడిందని చిరంజీవి వ్యాఖ్యానించడాన్ని వాళ్లు తప్పు పడుతున్నారు.

సీఎం టైమ్ ఇచ్చినా కలవలేదు.
సినిమా ఇండస్ట్రీ వాళ్లపై ఆగ్రహానికి మరో కారణం.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఇండస్ట్రీ నుంచి అధికారికంగా ఎవరూ ఇంతవరకూ సీఎం ను కలవలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓసారి మీటింగ్‌కు ప్రయత్నించారు. అప్పట్లో కొంతమంది పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఆ తర్వాత సీఎంతో మీటింగ్‌కు కిందటేడాది జూన్‌లో ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్‌లో వీరిని కలిసేవిధంగా ఓ ఆదివారం చంద్రబాబు టైమ్ ఇచ్చారు. కానీ కొంతమంది షూటింగ్‌లు ఉన్నాయని రాలేకపోవడంతో ఆ మీటింగ్ జరగలేదు. ఈ విషయాన్ని తెలంగాణ FDC చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్వయంగా చెప్పారు. ఇప్పుడు టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది.? (Why Nandi awards stopped in AP)

రాష్ట్ర విభజన తర్వాత 2016 లో మూడేళ్లకు నంది అవార్డులు ప్రకటించారు. అయితే ఈ అవార్డుల ఎంపికపై విమర్శలు చెలరేగాయి. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ అప్పటి వైఎస్సార్సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి వంటి వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అవార్డుల ప్రకటన అయితే జరిగింది కానీ.. వాటిని నేరుగా నటులకు అందజేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణంగా ప్రతీ ఏడాది ఉగాది నాడు నంది అవార్డులను ప్రదానం జరుగుతుంది. ఒకవేళ ఓ సంవత్సరం ఇవ్వకపోయినా రెండు- మూూడేళ్లకు ఓసారి అయినా ఇచ్చేవాళ్లు.. కానీ ఇంతవరకూ ఏపీ విభజన తర్వాత ఒక్కసారి కూడా నంది అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు.

కారణాలు ఏవైనా కానీ.. ఏపీలో కార్యక్రమం జరగకపోవడం ఓ లోటే. ఈ గ్యాప్‌ను సరిదిద్దడానికి ప్రయత్నాలు జరగాలి.