మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత బాలికలు పెడన మండలం బల్లిపర్రులోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఈ నెల 6వ తేదీన స్కూల్ నుండి మచిలీపట్నం చేరుకున్న బాలికలు, శారదా నగర్‌కు చెందిన తమ పరిచయస్తుడికి ఫోన్ చేశారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ తన మరో స్నేహితుడితో కలిసి ఆటోలో కోనేరు సెంటర్‌కు చేరుకున్నాడు. ఆ ఇద్దరు బాలికలను ఆటోలో ఎక్కించుకుని రుద్రవరం వైపు తీసుకెళ్లారు.

రుద్రవరంలోని నిర్మానుష్యంగా ఉన్న టిడ్కో (TIDCO) గృహాల వద్దకు బాలికలను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలికలు ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు ఒక బాలిక తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురికావడంతో, అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. దాంతో జరిగిన ఘోరాన్ని బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పెడన పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణంపై స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పెడన, బందరు రూరల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించారు. గురుకుల విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడింది మైనర్లే అని తెలిసి పోలీసులు షాకయ్యారు. బాలికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడి ఘటన కనుక మైనర్ నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోక్సో (POCSO) చట్టం: 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుండి రక్షణ కల్పించేందుకు ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) చట్టం-2012ను తీసుకొచ్చారు. ఈ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ మీరు కనుక ఆపదలో ఉంటే బాలికలు, మహిలలు సాయం కోసం అత్యవసర నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

చైల్డ్ హెల్ప్‌లైన్: 1098

పోలీస్ ఎమర్జెన్సీ / దిశ హెల్ప్‌లైన్: 112 / 100

తిరుపతి షెల్టర్ హోమ్ నుండి బాలిక పరార్
తిరుపతి నగరం వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోజినీ దేవి రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల సంరక్షణ పాఠశాల (చైల్డ్ హోమ్) నుంచి ఒక మైనర్ బాలిక పరారైంది. బాపట్ల జిల్లాకు చెందిన 15 ఏళ్ల కూన సాయిదుర్గ అనే బాలిక ఈ నెల 1వ తేదీన రైలులో తిరుపతికి చేరుకుంది. రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బాలికను గమనించిన 'శక్తి టీమ్' పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, సరోజినీ దేవి రోడ్డులోని చైల్డ్ హోమ్‌కు తరలించారు.

అయితే, ఆ షెల్టర్ హోమ్‌లో ఉండటం ఇష్టం లేని ఆ బాలిక, ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పరారైంది. ఈ విషయంపై ప్రభుత్వ పరిరక్షణ పాఠశాల సూపరింటెండెంట్ సునీత వెంటనే అప్రమత్తమై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన బాలిక ఆచూకీ కనుగొనేందుకు తిరుపతి పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.