Sammakka Saralamma Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జనవరి 28 బుధవారం నుంచి జనవరి 31 శనవారం వరకూ నాలుగు రోజుల పాటూ జరిగే జాతరకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అన్ని శాఖల అధికారులు. సౌకర్యాలు కల్పన ఓవైపు..నిర్మాణ పనులు మరోవైపు నిర్వహించారు. ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ఏర్పాట్లు పూర్తిచేశారు.

జనవరి 28 బుధవారం సారలమ్మ రాక

జనవరి 29న సమ్మక్క ఆగమనం

జనవరి 30న గద్దెలపై తల్లులకు మొక్కులు చెల్లింపు

జనవరి 31న దేవతల వనప్రవేశం...

ఈ ఏడాది జాతరకు దాదాపు 2 కోట్లమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 4 వేల ప్రత్యేక బస్సులు వేయడమే కాదు.. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తున్నారు.

AI డ్రోన్లు, భారీగా భద్రతా సిబ్బంది

తెలంగాణ పోలీసు శాఖ ఈ ఏడాది మేడారం జాతర చుట్టూ 'డిజిటల్ కోట' ఏర్పాటు చేసింది. జాతర పరిసరాల్లో వేలాది CCTV కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ జోడించారు. ఇవి నేరగాళ్ల ముఖాలను గుర్తుపట్టడమే కాదు ..రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి కంట్రోల్ రూమ్ కి అలర్ట్ పంపిస్తాయ్. ఇందుకోసం అత్యాధునిక డ్రోన్లను, కెమెరాలతో కూడిన హీలియం బెలూన్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ట్రాఫిక్ జామ్స్ , తొక్కిసలాట జరగకుండా ముందే హెచ్చరికలు జారీచేస్తాయ్. ఎవరు తప్పిపోయినా వెంటనే కనిపెట్టే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని 15వేలమంది పోలీసులు విధుల్లో ఉన్నారు

4 వేల ప్రత్యేక బస్సులు - 1,418 ఎకరాల్లో పార్కింగ్‍

మేడారం జాతర కోసం తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి 4 వేల బస్సులను RTC నడుపుతోంది. ఈ బస్సులలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఈ బస్సులు పార్కింగ్ చేసేందుకు 1,418 ఎకరాల విస్తీర్ణంలో 43 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మేడారంలో వన్ వే ఉంటుంది

రోడ్ల విస్తరణ

మేడారం జాతరకు లక్షల్ల మంది భక్తులు వాహనాల్లో తరలివస్తారు. ఈ మేరకు ట్రాఫిక్ నియంత్రణ సవాల్ గా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆ సమస్య లేకుండా సమీపంలో రోడ్లు, వంతెనల విస్తరణ చేపట్టారు. 100 కోట్లు వెచ్చించి...జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ , పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో మేడారానికి లింక్ అయి ఉన్న ప్రధాన రహదారులు అభివృద్ధి చేశారు.

వాగు ఆధునీకరణ

జాతరకు వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానమాచరించి వనదేవతలను దర్శించుకుంటారు. జంపన్నవాగు వద్ద ఘాట్లు మరమ్మతులు చేశారు. మరోవైపు బావుల్లో పూడిక తీసి మోటార్లతో వాగులోకి నీరు ఎత్తుపోసే ఏర్పాట్లు కూడా చేశారు. స్నానాల తర్వాత దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు షెడ్లు ఏర్పాటు చేశారు.

గద్దెల ప్రాంగణం మరింత విశాలం

జాతర నాలుగు రోజులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు , అమ్మవార్ల దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు గద్దెల ప్రాంగణాన్ని విస్తరించారు. ఈ విస్తరణ కారణంగా ఒకేసారి 10 మంది అమ్మలను దర్శించుకోవచ్చు

సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులే మా వీఐపీలు అని మంత్రి సీతక్క అన్నారు. వీఐపీ పాసులు ఫలహారంగా పంచిపెట్టలేం అని క్లారిటీ ఇచ్చారు. భక్తులంతా కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరి అత్యుత్సాహం కారణంగా తోపులాటలు జరుగుతాయని..ఈ ఏడాది అలాంటివి లేకుండా అందరూ...నిర్వాహకులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని, ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణతో వ్యవహరించాలని విజ్క్షప్తి చేశారు. వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాల బారిన పడొద్దని విజ్ఞప్తి చేశారు.