మార్గశిర గురువారం పూజ పూర్తిచేసిన తర్వాత ఈ వ్రతకథ చదువుకోవాలి.. వ్రత విధానం, నైవేద్యం గురించి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Margasira Lakshmi Vara Vratham Vrata Katha : పూర్వకాలం సుశీల అనే ఓ బాలిక ఉండేది. ఆమె చిన్నప్పుడే తల్లి మరణించింది. తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయిస్తూ విశ్రాంతి తీసుకునేది. కాలక్రమంలో సవతి తల్లి సుశీలకు ఓ బాబు పుట్టాడు. అప్పటి నుంచి ఇంటి పనులతో పాటూ తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా సుశీలపైనే పడింది. బాబుని ఆడిస్తున్నందుకు బదులుగా రోజూ ఓ చిన్న బెల్లం ముక్క ఇచ్చేది సవతి తల్లి. సుశీల పరిస్థితి చూసి ఇరుగుపొరుగువారు చలించిపోయారు. అన్నిటికీ ఆ అమ్మవారే ఉంది..శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకో అని చెప్పేవారు. ఆ మాటలు విని సుశీల.. మట్టితో శ్రీ మహాలక్ష్మి బొమ్మను తయారు చేసి ...ఆ బొమ్మనే అమ్మగా భావించి నిత్యం పూజచేసేది. సవతి తల్లి ఇచ్చిన బెల్లంముక్కను అమ్మవారిని నైవేద్యంగా పెట్టేది. కొంతకాలానికి యుక్తవయసుకి వచ్చిన సుశీలకు పెళ్లిచేసి పంపించేశారు. వెళుతూ వెళుతూ..మట్టితో తాను తయారుచేసుకున్న మహాలక్ష్మి బొమ్మను కూడా తనతో పాటూ తీసుకెళ్లింది. అప్పటి నుంచి అత్తవారింట్లో సిరిసంపదలు పెరిగాయ్..పుట్టింట్లో సంపద తుడిచిపెట్టుకుపోయి తల్లిదండ్రులు పూర్తి పేదరికంలో మునిగిపోయారు. కోడలు అడుగుపెట్టడంతోనే పొంగిపొర్లిన సిరిసంపదలు చూసి అత్తింటివారు సుశీలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు.

కొంతకాలానికి...
తన పుట్టింటివారు అనుభవిస్తున్న దారిద్ర్యం గురించి తెలుసుకుని బాధపడింది సుశీల. వారికి ఎలాగైనా సహాయం చేయాలని భావించి తన భర్తకు చెప్పింది. భర్త అనుమతి తీసుకున్న తర్వాత సోదరుడికి కబురుపెట్టి ఇంటికి రమ్మని చెప్పింది. ఓ కర్రకు జోలె కట్టి అందులో బంగారునాణేలు పోసి ఇచ్చింది. అక్క ఇంటి నుంచి బయలుదేరిన తమ్ముడు..మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ జోలెను పక్కనే ఉంచి చెరువు వద్దకు వెళ్లి వచ్చాడు. అప్పటికి ఆ బంగారు నాణేలు కనిపించకపోవడంతో ఎవరో దొంగతనం చేశారని భావించి బాధగా ఇంటికి వెళ్లిపోయాడు.

మరికొంత కాలానికి
గతంలో ఇచ్చిన బంగారు నాణేల జోలెను పొగొట్టుకున్నానని సోదరుడు చెప్పాడు. దిగులు చెందవద్దు అని చెప్పిన సుశీల ఈ సారి ఓ చెప్పుల జోడు తెప్పించి వాటి నిండా వరహాలు పోసి ఇచ్చింది. అప్పుడు కూడా ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యలో ఆ చెప్పుల జోడుని కుక్క ఎత్తుకెళ్లిపోయింది.

ఇంకొంత కాలానికి..
మళ్లీ వరహాలు పోగొట్టుకున్నాడని తెలుసుకున్న సుశీల ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి సవతి తల్లికి పంపించింది. తిరుగు ప్రయాణంలో ఓ చోట చద్ది తింటుండగా..ఓ దొంగ వచ్చి గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాడు. తన దురదృష్టానికి తనను తానే తిట్టుకుని ఇంటికి చేరుకున్నాడు..

ఓసారి...
తన పుట్టింటివారిని చూడాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లింది సుశీల. తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు మొత్తం తెలుసుకుని బాధపడింది. పుట్టింటి దారిద్ర్యం తొలగిపోవాలంటే...శ్రీ మహాలక్ష్మిని పూజించేలా చేయాలని నిర్ణయించుకుంది. తాను పూజ చేసినట్టే మార్గశిరమాసం గురువారాల్లో తల్లితో వ్రతం చేయిస్తే పుట్టింటి పరిస్థితి మారుతుందని గ్రహించి..తనతో పాటూ తల్లిని తీసుకెళ్లింది

మార్గశిర మాసం ప్రారంభమైంది...

మొదటి గురువారం తల్లితో నియమ నిష్ఠలతో పూజ చేయిద్దాం అనుకుంది. ఈ రోజు ఏమీ తినవద్దని చెప్పింది. కానీ ఆ తల్లి పిల్లలకు తినిపిస్తూ చటుక్కున నోట్లో వేసుకుంది. ఆ రోజు పూజ పనికిరాదని తర్వాత వారం చేయిద్దాం అనుకుంది సుశీల. రెండో గురువారం పిల్లలకు జడ వేస్తూ చేతికి ఉన్న ఆ జిడ్డును తలకు రాసేసుకుంది...ఇక రెండోవారం కూడా పూజ చేసేందుకు పనికిరాకుండా పోయింది. మూడోవారం అనుకోకుండా తల దువ్వుకుని చిక్కులు తీసుకుని జడ వేసుకుంది...ఇక మూడో వారం కూడా పోయింది. మరోవారం పూజ చేయించాల్సిందే అని తల్లిని ఓ గదిలో పెట్టి గడియ పెట్టేసింది. పిల్లలు అరటిపండ్లు తిని తొక్కలు అటుగా విసిరేశారు. ఆకలికి ఆగలేని ఆ తల్లి ఆ తొక్కలు తినేసింది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయని భావించి బాధపడింది. ఇక ఆఖరివారం అవకాశం వదులుకోకూడదని భావించి.. తల్లి కొంగుని తన కొంగుకి ముడివేసుకుని చిన్న పిల్లలా దగ్గరే ఉంచి పట్టుదలగా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది. వ్రతభంగం కాకుండా పూజ చేసుకుని తల్లితోనూ పూజ చేయించింది. పూజ పూర్తైన తర్వాత సుశీల పెట్టిన నైవేద్యం స్వీకరించిన శ్రీ మహాలక్ష్మి..ఆమె సవతి తల్లి పెట్టిన నైవేద్యం తిరస్కరించింది. ఇదేమని అడగగా..నువ్వు చిన్నప్పుడు నా పూజ చేసినప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది.. ఆ దోషం వల్ల ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరించను అని చెప్పింది అమ్మవారు. తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థించింది సుశీల. అప్పుడు అమ్మవారు శాంతించి సుశీల పుట్టినింటికి కూడా సిరిసంపదలు ప్రసాదించింది.

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్గశిరమాంలో గురువారాలు నియమ నిష్టలతో పూజ పూర్తిచేసి.. తమ శక్తి కొలది పరమాన్నం, పులగం, బూరెలు, అప్పాలు, పులిహోర నైవేద్యంగా సమర్పించి..కుటుంబం అంతా ఆనందంగా ఉండేవారు.