<p>Kandula Durgesh on Maoists Letter | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు లేఖలు కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ ప్రారంభించాయి. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ బెదిరింపు లేఖల వార్త చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.</p>
<p>మావోయిస్టుల లేఖ అంశంపై మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్‌చాట్ సందర్భంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిర్వహిస్తున్నది పర్యాటక శాఖ వంటి చిన్న శాఖ అని, తనకు మావోయిస్టులు లేఖలు రాయాల్సినంత పెద్ద వివాదాలు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగతంగా గానీ, శాఖాపరంగా గానీ తాము ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదని కందుల స్పష్టం చేశారు. సాధారణంగా మావోయిస్టుల నుంచి వచ్చే లేఖల శైలి ఇలా ఉండదని, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లేఖలు సృష్టించి ఉంటారని మంత్రి అభిప్రాయపడ్డారు.</p>
<p>ఈ బెదిరింపుల లేఖలపై మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ లేఖ వెనుక ఉన్న కుట్రను, అసలు కారకులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తుతెలియని వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చిన కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.</p>