Mangoes Smart Buying Tips : వేసవి అంటే చాలామందికి గుర్తొచ్చేది మామిడిపండ్లే. ఉగాది తర్వాత పచ్చడి మామిడికాయలతో పాటు.. మామిడి పండ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవి వాటి రుచి, సువాసనతో బాగా ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మార్కెట్లో లభించే అన్ని మామిడిపండ్లు సహజంగా పండినవి కావు. కొన్నింటిని కెమికల్స్‌తో త్వరగా పండిస్తారు. ఇవి రుచి లేకపోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి.

అందుకే మామిడిపండ్లు కొనేటప్పుడే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. ముందుగానే వీటిని ఫాలో అవ్వడం వల్ల కృత్రిమంగా పండించిన పండ్లను సులభంగా గుర్తించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. మరి మంచిగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించవచ్చో.. కృత్రిమ పండ్లకు ఎలా దూరంగా ఉండొచ్చో చూసేద్దాం.

రంగును గమనించండి

సహజంగా పండిన మామిడిపండ్లు పూర్తిగా ఒకే రంగులో ఉండవు. కొద్దిగా పచ్చ, పసుపు మిక్స్‌గా ఉంటాయి. కానీ కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లు పూర్తిగా పసుపు లేదా షైనీగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి.

వాసన చూడండి..

సహజంగా పండిన పండ్లు మధురమైన సువాసనతో ఉంటాయి. కృత్రిమంగా పండించిన మామిడిపండ్లకు వాసన తక్కువగా లేదా అసహజంగా ఉంటుంది.

పండును నొక్కండి..

సహజంగా పండిన మామిడి కొద్దిగా మృదువుగా ఉంటుంది. కెమికల్‌తో పండించినది బయట మృదువుగా కనిపించినా లోపల గట్టిగా ఉండొచ్చు. కాబట్టి పండు కొనే ముందు కాస్త నొక్కి చెక్ చేసుకోవాలి.

నల్లటి మచ్చలు

మామిడి పండుపై చాలా ఎక్కువగా నల్లటి మచ్చలు, అసహజమైన స్పాట్స్ ఉంటే.. అది కృత్రిమంగా పండిందని అర్థం.

రుచిలో మార్పులు..

సహజంగా పండిన పండు తియ్యగా, జ్యూసీగా ఉంటుంది. కృత్రిమంగా పండినది కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది. చూసేందుకు మంచిగా ఉన్నా.. అంతగా రుచించదు.

నీటిలో వేస్తే..

మామిడిపండును నీటిలో వేసినప్పుడు.. సహజంగా పండిన మామిడి పండు మునిగిపోతుంది. కృత్రిమంగా పండినది తేలిపోతుంది.

పండు లోపలి రంగు

సహజంగా పండిన పండులో రంగు సమంగా ఉంటుంది. కెమికల్ పండ్లలో లోపల తెల్లగా లేదా అసమానంగా ఉండొచ్చు.

తెల్లటి పొడి

పండ్లు ఎక్కువకాలం తాజాగా కనిపించేందుకు, పసుపుగా ఉండేందుకు కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వాడతారు. అవి వాడితే పండుపై తెల్లటి పొడి కనిపిస్తుంది.

ఇలా కృత్రిమంగా పండించిన మామిడిపండ్లను గుర్తిస్తే వాటికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. అలాగే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎక్కువకాలం తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు.

మామిడి తినాలంటే

మార్కెట్లో పండ్లు కొన్న తర్వాత వాటిని బాగా కడగాలి. ఆ తర్వాత తినాలి. వీలైతే ఆర్గానిక్ లేదా నమ్మకమైన చోట మాత్రమే మామిడి కొనండి. అలాగే పండు తినే ముందు కొద్దిసేపు నీటిలో నానబెట్టండి. కాబట్టి మామిడిపండ్లు కొనేటప్పుడు కంగారు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కెమికల్ బేస్డ్ మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. సహజంగా పండిన పండ్లనే ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.