Maha Kumbh Mela 2025 in Prayagraj | ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. మహా కుంభమేళ ప్రారంభమైన తొలిరోజైన జనవరి 13న ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే పవిత్ర నదీ స్నానం చేసిన వారిలో పలువురు అస్వస్థకు గురై ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. సోమవారం కుంభమేళలో పాల్గొని స్నానమాచరించిన వారిలో 132 మంది అస్వస్థతకు గురికాగా, మెడికల్ టీమ్ వారి ప్రథమ చికిత్స చేసింది. చాలా మందిలో దగ్గు, జలుబు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రతికూల వాతావరణం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, చలి గాలులు, చన్నీటి స్నానం లాంటి కారణాలతో చిన్నారులతో పాటు వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారని అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తొలిరోజు మహా కుంభమేళాకు తరలిరావడంతో వారి అరుపులు, కేకలతో సైతం కొందరు గుండె సంబంధిత సమస్యల బారిన పడ్డారు. అయితే సెంట్రల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా చాలా మంది భక్తులు ఔట్ పేషెంట్ విభాగాన్ని (OPD)లో చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో జునా అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ అస్వస్థతకు లోనయ్యారు. అనుచరులు వెంటనే అప్రమత్తమై ఆయనకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు.

భక్తులపై గులాబీల వర్షం
ప్రతికూల వాతావరణం ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ బాట పట్టారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో 'అమృత స్నానం' చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో నేటి ఉదయం భక్తులపై హెలికాప్టర్ నుంచి గులాబీ పూల వర్షం కురిపించారు. "జై శ్రీ రామ్", "హర్ హర్ మహాదేవ్", ఓం నమ శివాయ నినాదాలు ప్రయాగ్ రాజ్‌ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతిధ్వనిస్తున్నాయి.