Vishal's Madha Gaja Raja Review in Telugu: సంక్రాంతికి తమిళంలో విడుదలైన 'మద గజ రాజా' భారీ విజయం సాధించింది. సుమారు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... 12 ఏళ్ళ తర్వాత విడుదల కావడం! ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లు. తమిళంలో విజయం సాధించడానికి కారణం ఏమిటి? తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏమున్నాయి? అంటే...

కథ (Madha Gaja Raja Movie Story): రాజు... ఎంజీఆర్... మద గజ రాజా (విశాల్) అరకులో కేబుల్ ఆపరేటర్. అతని తండ్రి ఎస్సై. పదేళ్ల తర్వాత ఊరు వచ్చిన ఓ కేసులో ముద్దాయి కుమార్తె మాధవి (అంజలి)తో ప్రేమలో పడతాడు. అయితే, తండ్రి వల్ల ప్రేమకు బ్రేక్ పడుతుంది. సరిగ్గా ఆ సమయంలో చిన్ననాటి స్కూల్ మాస్టర్ నుంచి ఫోన్ రావడంతో ఆయన కుమార్తె పెళ్లికి వెళతాడు. అక్కడ బాల్య స్నేహితులు కలుస్తారు. మాయ (వరలక్ష్మీ శరత్ కుమార్) పరిచయం అవుతుంది.

రాజు స్నేహితులు ముగ్గురికీ ఒక్కో సమస్య ఉంటుంది. టీచర్ కుమార్తె పెళ్లిలో మరో సమస్య. వాటిని ఎలా పరిష్కరించాడు? ఏకంగా ముఖ్యమంత్రిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోగల మీడియా టైకూన్ కాకర్ల విశ్వనాథ్ (సోనూసూద్)కు సవాల్ విసిరిన రాజు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? మంత్రి సత్తిపండు (మనోబాల)ను రాజు ఎలా వాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Madha Gaja Raja Review): కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడం దర్శకుడు సుందర్ సి స్టైల్. వంద కోట్లకు పైగా వసూలు చేసిన 'అరణ్మణై 4' లేదా అంతకు ముందు తీసిన సినిమాలు కావచ్చు... ప్రతిదీ కమర్షియల్ పంథాలో తీసిన సినిమాలే. హీరోయిజం, కామెడీ, హీరోయిన్స్ గ్లామర్... మాస్ జనాలు మెచ్చే అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకుంటారు సుందర్ సి. ఇప్పుడీ 'మద గజ రాజా'లోనూ అంతే.

సీఎంను శాసించే శక్తి ఉన్న వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు? ఇదీ క్లుప్తంగా 'మద గజ రాజా' కథ. ఇటువంటి కథల్లో హీరోకి బుద్ధిబలం అయినా ఉండాలి లేదా కండబలం అయినా ఉండాలి. శక్తిశాలిని తెలివితో అయినా బురిడీ కొట్టించాలి లేదా తన బలంతో అయినా కొట్టాలి. కానీ, సుందర్ సి కామెడీని ఎంచుకున్నారు. కథ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కామెడీ మీద ఆయన భారం వేశారు. లాజిక్ అనేది ఒకటి ఉంటుందని ఒక్కటంటే ఒక్క పాయింట్‌లోనూ ఆలోచించలేదు. ఓ 12 ఏళ్ల క్రితం రాసిన కథ, తీసిన సినిమా ఎలా ఉంటాయో... 'మద గజ రాజా' కూడా అలాగే ఉంది. అందులో డౌట్ లేదు.

సోనూసూద్ పెద్ద వ్యాపారవేత్త. సీఎంని సైతం తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోలగడు. అతని పీఏ దగ్గరకు ఒక సామాన్యుడు వచ్చి తాను సీబీఐ అంటే బాస్ దగ్గరకు తీసుకు వెళతాడు. ఫోన్ చేసి 'నేను సీఎం' అంటే బాస్ కి ఫోన్ ఇస్తాడు. సుందర్ సి కామెడీలో ఇవన్నీ భాగమే. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని కమర్షియల్ ప్యాకేజీలో కామెడీ సినిమా తీశారు. ఆ జానర్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావాల్సిన అంశాలు ఉండేలా చూసుకున్నారు.

'మద గజ రాజా'లో దర్శకుడు సుందర్ సి సూపర్ సక్సెస్ కొట్టిన విషయం ఏదైనా ఉందంటే... అది కామెడీ! సంతానం కోసం రాసిన పంచ్ డైలాగ్స్, ఆ ట్రాక్ తీసిన విధానం మెజారిటీ మాస్ జనాలను మెప్పిస్తుంది. హీరోయిన్లను చాలా గ్లామరస్‌గా చూపించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన పాటలు 12 ఏళ్ళ క్రితం కమర్షియల్ సినిమాలను గుర్తు చేశాయి. సదా ప్రత్యేక గీతం 'తుంబకి తొంబ' బీట్ బావుంది. అయితే, ఆ నేపథ్య సంగీతం ఎక్కడో విన్నట్టు ఉంటుంది.

కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ 12 ఏళ్ల క్రితం సినిమాకు ఉన్నట్టు ఉన్నాయి. సాధారణంగా సుందర్ సి సినిమాను చుట్టేస్తారని పేరుంది. పైగా, ఇది 12 ఏళ్ళ క్రితం సినిమా. టెక్నికల్ పరంగా అప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. సో... ఆ లెక్కన చూస్తే ఈ సినిమా చాలా పూర్‌గా ఉంటుంది.

Also Read: 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?

హీరోగా విశాల్ ఇటువంటి క్యారెక్టర్లు, సినిమాలు 12 ఏళ్లలో కొన్ని చేశారు. కానీ, ఈ సినిమాలో యంగ్‌గా ఉన్నారు. వింటేజ్ విశాల్ కనిపించారు. పన్నెండేళ్ల క్రితం తీసిన సినిమా కదా! ఫేస్‌లో అప్పటి ఇన్నోసెన్స్ ఉంది. హ్యాండ్సమ్‌గా ఉన్నారు. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేశారు. గ్లామర్ షోతో సందడి చేశారు. ఆర్టిస్టులు అందరిలోనూ హైలైట్ అంటే... సంతానం, 'దివంగత' మనోబాల. బి, సి సెంటర్లలో వాళ్ళ మాస్ కామెడీకి విజిల్స్ పడతాయి.

Madha Gaja Raja Telugu Review: కథ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ వంటివి ఆలోచించకుండా జస్ట్ మాస్ కామెడీ ఎంజాయ్ చేసే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది. కమర్షియల్ సినిమా ఎంజాయ్ చేసే ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంటర్వెల్ ముందు సంతానం, ఇంటర్వెల్ తర్వాత మనోబాల... నవ్వించారు. డెడ్ బాడీతో ఆ కామెడీ ఏంటని ఆలోచిస్తే కష్టం. సో... బ్రెయిన్ పక్కన పెట్టేసి కామెడీ ఎంజాయ్ చేయాలంతే!

Also Read: 'వైఫ్ ఆఫ్' రివ్యూ: రాత్రికొచ్చే అమ్మాయి... గంజాయి... ఎఫైర్లు... ETV Winలో కొత్త సస్పెన్స్ డ్రామా ఎలా ఉందంటే?