Lokesh meets Prime Minister Modi on Friday: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది కాలం నుంచి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మోదీతో భేటీ కాలేదు. ఇతర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అంశాలపై మాట్లాడి వచ్చారు.

గతంలో కుటుంబంతో సహా కలిసిన నారా లోకేష్

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీతో లోకేష్ ఓ సారి సమావేశం అయ్యారు. రెండు సార్లు ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. నారా లోకేష్‌ను కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించారు. ఆ సూచన ప్రకారం గతంలో కుటుంబంతో సహా ప్రధానని కలిశారు. అయితే అప్పట్లో ఆ సమావేశంలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించలేదని కేవలం వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడారని తెలుస్తోంది. అందుకే ఈ సారి పూర్తిగా పాలనా పరమైన..రాజకీయ సంబంధమైన అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

గత నెలలో కేంద్ర మంత్రులతో సమావేశాలు -అప్పట్లో మోదీతో భేటీకి కుదరని సమయం

గత నెలలో ఢిల్లీలో యూనియన్ మంత్రులతో లోకేష్ సమావేశాలు జరిపి, యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరారు. ఇప్పుడు మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది.

పోలవరం, అమరావతి పురోగతిపై మోదీకి వివరించే అవకాశం

పోలవరం , అమరావతి నిర్మాణాల పురోగతిని ప్రధాని మోదీకి లోకేష్ వివరించే అవకాశం ఉంది. మోదీ-లోకేష్ సమావేశం తర్వాత రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు రావచ్చని అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహాయం, రాజకీయ సమన్వయం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. లోకేష్ సెప్టెంబర్ 4 రాత్రి ఢిల్లీకి బయలుదేరి, 5 ఉదయం మోదీతో సమావేశమై, మధ్యాహ్నం అమరావతికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

గత ప్రభుత్వం చేసిన అవినీతిపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను కూడా నారా లోకేష్ ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.