LIC Launches Smart Pension Plan: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), కొత్త పింఛను పథకం "ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌"ను ప్రారంభించింది. ఫిబ్రవరి 19, 2025న దీనిని మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఇది సింగిల్‌ ప్రీమియం పెన్షన్‌ ప్లాన్‌. అంటే, ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పింఛను లభిస్తుంది. పాలసీదార్ల రిటైర్మెంట్‌ అవసరాలు తీర్చడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది నాన్-పార్, నాన్-లింక్డ్, ఇండివిడ్యుల్‌/గ్రూప్‌, సేవింగ్స్‌, ఇమ్మీడియేట్‌ యాన్యుటీ ప్లాన్.

వయస్సు అర్హత
యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి 18 ఏళ్ల నుంచి 100 ఏళ్ల లోపు వయస్సుగల వ్యక్తులు ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ కొనుగోలు చేయవచ్చు. కనీస వయస్సు 18 సంవత్సరాలు కాబట్టి, యువత తమ ఆర్థిక ప్రణాళికలను చాలా ముందుగా ప్రారంభించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

యాన్యుటీ ఆప్షన్లు
పాలసీదారులు సింగిల్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు, జీవితాంతం యాన్యుటీ డబ్బులు వస్తూనే ఉంటాయి. జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్‌ కూడా ఎంచుకోవచ్చు, దీనిలో ఇద్దరికీ జీవితాంతం యాన్యుటీ చెల్లింపులు కొనసాగుతాయి. అంటే, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్‌ ఎంచుకుంటే పాలసీదారు జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం ఆర్థిక భద్రత లభిస్తుంది. 5 లేదా 10 లేదా 15 లేదా 20 సంవత్సరాల పాటు గ్యారంటీ యాన్యుటీ (పెన్షన్) లభిస్తుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఈ మొత్తం 3% లేదా 6% పెరుగుతుంది. యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి పింఛను పొందిన తర్వాత, పాలసీదారులకు పెట్టుబడి మొత్తాన్ని ఎల్‌ఐసీ తిరిగి చెల్లిస్తుంది. అంటే, పింఛను వస్తుంది + పెట్టుబడి కూడా తిరిగొస్తుంది. 75 లేదా ఏళ్ల వయస్సు వచ్చాక పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది.

ప్లాన్‌ ధర & యాన్యుటీ చెల్లింపులు
కనీసం రూ. 1 లక్షతో యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయాలి, గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎంచుకున్న యాన్యుటీ పేమెంట్‌ ఆధారంగా.. నెలకు రూ. 1000, త్రైమాసికానికి రూ. 3000, అర్ధ సంవత్సరానికి రూ. 6000, సంవత్సరానికి రూ. 12000 చొప్పిన కనీస యాన్యుటీ పొందవచ్చు. గరిష్ట యాన్యుటీ చెల్లింపుపై పరిమితి లేదు. ఈ డబ్బును, కస్టమర్‌ ఇష్టప్రకారం నెలకోసారి, త్రైమాసికానికి, ఆరు నెలలకు, ఏడాదికి ఒకసారి చొప్పున తీసుకునేలా ఆప్షన్‌ పెట్టుకోవచ్చు.

రుణ సదుపాయం
ఫ్రీ-లుక్‌ పీరియడ్‌ (Free-look period) లేదా 3 నెలలు దాటిన తర్వాత ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌పై లోన్‌ వచ్చే అవకాశం ఉంది.

ఆదాయ పన్ను ఆదా
ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఎక్కడ కొనాలి?
స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ కొనుగోలుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆఫ్‌లైన్ మార్గంలో.. LIC ఏజెంట్లు, మధ్యవర్తులు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI), కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (CSC) నుంచి ఈ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో... LIC ఇండియా వెబ్‌సైట్‌ www.licindia.in నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారు మరణిస్తే, కొనుగోలు సమయంలో ఎంచుకున్న ఆప్షన్‌ ఆధారంగా నామినీకి చెల్లింపులు జరుగుతాయి.

మరో ఆసక్తికర కథనం: 10 గ్రాములు కాదు, 1 గ్రాము కొనడం కూడా కష్టమే - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ