Lent Days 2025: క్రైస్తవులకు ప్రధానంగా, యేసు క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25వ తేదీని క్రిస్మస్‌గా, ఆయన శిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా, ఆయన తిరిగి లేచిన రోజును ఈస్టర్‌గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అదే రీతిలో లెంట్ డేస్‌ను కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవలు ఆచరిస్తారు. క్రైస్తవుల్లోని క్యాథలిక్కులు, ఫ్రోటెస్టంట్స్, ఆర్థడాక్స్ శాఖల వారందరూ ఈ లెంట్ డేస్‌ను పాటిస్తారు. దీన్నే శ్రమల కాలం అని, మండల కాలం అని, ఉపవాస దినాలు అని పిలుస్తారు. అయితే అసలు ఈ లెంట్ డేస్ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు ఇది ఆచరిస్తారు?ఆ రోజుల్లో వారు ఏం చేస్తారు?

లెంట్ డేస్ అంటే ఏంటి ?
లెంట్ అనే పదం ప్రాచీన ఆంగ్ల భాషలోని LENCTEN అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి వసంత రుతువు అని అర్థం. ఇది యేసు క్రీస్తు శిలువ త్యాగం, తిరిగి పునరుత్థానం చెందడాన్ని గౌరవించేందుకు సంబంధించిన పవిత్రమైన కాలంగా క్రైస్తవులు భావిస్తారు. లాటిన్ భాషలో దీనికి సమాన అర్థం "Quadragesima" అంటే "నలభై" అని అర్థం వస్తుంది. యేసు క్రీస్తు బోధనలు ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారని బైబిల్‌లో రాసి ఉంది. మానవులందరినీ పాపం నుంచి విముక్తి కలిగించడానికి వచ్చిన యేసు క్రీస్తు 40 దినాలు ఉపవాసం తర్వాతే తన కార్యాచరణ ప్రారంభించారని దానికి సూచనగా ఈ లెంట్ డేస్‌ను ఆచరిస్తారు.

బైబిల్‌లో ఈ నలభై రోజుల ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మోషే, ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారని చెబుతారు. నోవహు కాలంలో 40 రోజుల పాటు ఆగకుండా వర్షం కురిపించారట. దాన్నే జళ ప్రళయంగా క్రైస్తవులు చెబుతారు. ఇలా నలభై రోజులు అనేది క్రైస్తవులకు ఓ ప్రత్యేకమైన అంశం. ఈ 40 రోజుల ఉపవాస కాలమే లెంట్ డేస్‌గా క్రైస్తవులు ఆచరిస్తారు.

లెంట్‌ డేస్ ఆచరణ ఏంటి ?
ఈ ఏడాది మార్చి ఐదో తేదీ నుంచి ఈ లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి. యేసు క్రీస్తు శిలువపై మరణించి, తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన దినం అదే ఈస్టర్ పండుగ ( ఏప్రిల్ 19వ తేదీ) ఆ రోజు వరకు లెంట్ డేస్‌ను ఆచరిస్తారు. అయితే ఇవి 46 దినాలు. కాని ఆదివారాలు తీసేసి సరిగా ఈ నలబై దినాలు పాప ప్రాయచిత్తం కోసం, ఆత్మ శుద్ధి కోసం ఈ ఉపవాస దినాలు పాటిస్తారు. మరి కొద్ది మంది ఉపవాసం ఉండకున్నా ఈ నలబై రోజులు మాంసాహారం మానేస్తారు. ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల వంటి వాటికి ఈ లెంట్ డేస్ పరమార్థంగా క్రైస్తవులు భావిస్తారు.

ఉపవాసాలతోపాటు ప్రతీ రోజు సాయింత్రం చర్చిలో జరిగే ప్రార్థనలకు హజరవుతారు. చర్చిలో బైబిల్‌లోని ఓ పాత నిబంధన వాక్యం, ఒక కొత్త నిబంధనలోని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఆ వాక్యానికి అన్వయించే పాటలు పాడతారు. పాపాలు ఒప్పుకుని, వాటిని విడిచి పెట్టే రీతిలో పశ్చాతాప్తపడతారు.

లెంట్ డేస్ ఆచరణ ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
ఈ లెంట్‌డేస్ ఆచరణ అనేది క్రీ.శ రెండో శతాబ్ధం నుంచే ఆరంభమైందని క్రైస్తవ మత పెద్దలు చెబుతారు. యేసు క్రీస్తును ఫాలో అయ్యే తొలి తరం శిష్యులు కూడా ఈ పద్ధతిని ఆచరించారని చెబుతారు. తొలుత ఈ లెంట్ డేస్‌ను స్వల్ప కాల ఉపవాస దీక్షగా ఆనాటి తొలి తరం క్రైస్తవులు ఆచరించేవారు. క్రీ.శ నాల్గో శతాబ్ధానికి వచ్చే నాటికి ఇది నలభై రోజుల ఉపవాస దీక్షగా మారింది. క్రీ.శ 325వ సంవత్సరంలో జరిగిన నైసియా కౌన్సిల్‌లో లెంట్ డేస్ ఆచరణ అనేది అధికారికంగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ లెంట్ డేస్ ఆచరణ అనేది అధికారికంగా చర్చిల్లో జరుపుతున్నారు.

క్రైస్తవం ప్రారంభమైన తొలి నాళ్లలో చాలా మంది ఈ మతంలో చేరేందుకు వచ్చే వాళ్లు. అలా వచ్చిన వారంతా అందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు 40 రోలుజ ఉపవాస పరీక్ష పెట్టేవాళ్లట. ఇలా 40 రోజులు ఉపవాస దీక్షతో సిద్దపడిన తర్వాతే వారికి బాప్టిజం ఇచ్చే వాళ్లను చెబుతారు. ఇలా ఆ తర్వాత కూడా ఈ నలభై రోజుల దీక్షను క్రైస్తవులంతా పాటించే విధానం అమల్లోకి వచ్చిందని చర్చి పెద్దలు చెబుతారు.

Also Read: రంజాన్ పండుగ ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా ?