AP Local Body Elections | శ్రీకాకుళం: వివాదాస్పద కొఠియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ మొదలైంది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొఠియా గ్రామాలను 3 ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి, నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. నేటి (అక్టోబరు 23) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండటంతో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి, ఏపీలోని సాలూరు మండల పరిధిలోని 21 గ్రామాలను తమవిగా ఇరు రాష్ట్రాలూ క్లెయిమ్ చేస్తున్న క్రమంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఏపీ, ఒడిశా మధ్య మరోసారి వివాదానికి దారితీసింది.

ఏపీ నిర్ణయంపై ఒడిశా ప్రభుత్వం ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి నేతృత్వంలో అడ్వకేట్ జనరల్, దక్షిణ రెవెన్యూ కమిషనర్, కొరాపుట్ కలెక్టర్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన యథాతథ స్థితి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, తమ రాష్ట్ర సమగ్రతను కాపాడుకునేందుకు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి పూజారి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక పోలీసు, రెవెన్యూ అధికారులను నియమించారు. కొరాపుట్ సబ్ కలెక్టర్ ఫాబీ రషీద్ ప్రతిపాదిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఒడిశా ప్రభుత్వంపై నవీన్ పట్నాయక్ ఒత్తిడి

ఏపీ ప్రభుత్వం చర్యలపై బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉందంటూ ఒడిశా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ప్రస్తుత సీఎం మోహన్ చరణ్ మాఝీకి లేఖ రాసి ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి స్పందించిన మంత్రి సురేష్ పూజారి, గత బీజేడీప్రభుత్వ నిర్లక్ష్యం, మొద్దునిద్ర వల్లే ఈ సమస్య జటిలమైందని ఘాటుగా బదులిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలకలు ఈ నోటిఫికేషన్‌ను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఏకం కావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండగా, ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉండటం కేంద్ర ప్రభుత్వానికి చిక్కుముడిగా మారింది. గతంలో గో బ్యాక్ ఆంధ్రా అనే నినాదాలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఏం చేయకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని నవీన్ పట్నాయక్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కొఠియా గ్రామాల సరిహద్దు వివాదంపై ఒడిశా ప్రభుత్వం 1968లోనే తొలిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టులో రెండు రాష్ట్రాల తరఫున వాదనలు జరిగాయి. విచారణ వాయిదా వేసినా ఎలాంటి తీర్పు రాకపోవడంతో ఏపీలో స్థానిక ఎన్నికల కారణంగా మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతోంది. ఒడిశా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎన్నికలకు అడ్డుకట్ట వేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. దాంతో సుప్రీంకోర్టు తమకు అనుకూల తీర్పు ఇస్తుందని రెండు రాష్ట్రాలు ధీమాగా ఉన్నాయి.