Kalyani Priyadarshan's Kotha Lokah Chapter 1 Chandra Review In Telugu: కల్యాణీ ప్రియదర్శన్ తెలుగులోనూ పాపులర్. అఖిల్ అక్కినేని 'హలో', సాయి దుర్గా తేజ్ 'చిత్రలహరి'లో నటించారు. మలయాళంలో ఆవిడ నటించిన ఫిమేల్ సూపర్ హీరో సినిమా 'కొత్త లోక 1: చంద్ర'. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ నస్లీన్ నటించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్ అతిథి పాత్రల్లో సందడి చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. మలయాళంలో ఆగస్టు 28న, తెలుగులో ఆగస్టు 29 సాయంత్రం ఆటలతో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.

కథ (Kotha Lokah Chapter 1 Story): చంద్ర (కల్యాణీ ప్రియదర్శన్)కు సూపర్ పవర్స్ ఉంటాయి. కొంత మందికి మాత్రమే ఆ విషయం తెలుసు. తన పవర్స్ బయట పడనివ్వకుండా సాధారణ అమ్మాయిలా బెంగళూరు వచ్చి రెస్టారెంట్‌లో ఉద్యోగంలో చేరుతుంది. నైట్ షిఫ్ట్స్ మాత్రమే చేస్తుంది. అద్దెకు దిగిన ఎదురు అపార్ట్‌మెంట్‌లో సన్నీ (నస్లీన్‌) ఉంటాడు. చంద్ర మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు.

చంద్ర సూపర్ విమెన్ అని సన్నీ తెలుసుకున్నాడా? లేదా? బెంగళూరులో చంద్ర ఎవరి నుంచి ముప్పు ఎదుర్కొంది? చంద్రను నాచియప్ప గౌడ (శాండీ) ఎందుకు టార్గెట్ చేశాడు? ఆవిడపై ఎందుకు టెర్రరిస్ట్ ముద్ర వేశారు? చంద్ర బలహీనత ఏమిటి? ఆవిడ చంపాలని వచ్చింది ఎవరు? చంద్ర గతం ఏమిటి? నీలి (కల్యాణీ ప్రియదర్శన్) ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Kotha Lokah Chapter 1 Telugu Review): 'కొత్త లోక 1: చంద్ర' థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది. మన భారతీయ తెరపై సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. హాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ హీరో సినిమాలు వచ్చాయ్. అయితే... కథ, సన్నివేశాల విషయంలో అడుగడుగునా నేటివిటీ గుర్తు చేసేలా తీయడం 'కొత్త లోక 1: చంద్ర' ప్రత్యేకత.

విజువల్స్, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్సుల విషయంలో హాలీవుడ్ రిఫరెన్సులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. మధ్యలో డల్ మూమెంట్స్ కొన్ని కొన్ని ఉన్నాయి. అయితే ఒక్క క్షణం కూడా ఫోన్ తీసి పక్కకు చూడలేం. దర్శకుడిగా కంటే రచయితగా డొమినిక్ అరుణ్ 'కొత్త లోక 1: చంద్ర'లో ఎక్కువ ప్రతిభ చూపించారు. ఫిమేల్ సూపర్ హీరో సినిమా అంటే ఏదో సింపతీ కోసం ట్రై చేయలేదు. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు రాసేటప్పుడు మహిళలు కష్టాలు అన్నట్టు కొందరు చూపిస్తారు. 'కొత్త లోక 1: చంద్ర'లో అసలు అలా చేయలేదు. అణిచివేతకు ఎదురు నిలిబడి పోరాడిన యోధురాలిగా చంద్ర / నీలి పాత్రను చూపించడం బావుంది. ఇంటర్వెల్ తర్వాత 'వండర్ వుమెన్'ను కాస్త గుర్తు చేస్తుంది.

'కొత్త లోక 1: చంద్ర'లో మెచ్చుకోవాల్సిన అంశం... మైథాలజీని సూపర్ హీరో కథగా మార్చిన తీరుకు! యక్షిణి గురించి పురాణాల్లో విన్నాం. ఆ యక్షిణిని బ్యాట్ మ్యాన్ తరహాలో చూపించడం బావుంది. రెగ్యులర్ సూపర్ హీరో కథలతో కంపేర్ చేసినా 'కొత్త లోక 1: చంద్ర' నిజంగా కొత్తగా ఉంటుంది. నిజానికి ఇందులో కథను కంప్లీట్ చేయలేదు. జస్ట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. నీలి / చంద్ర పాత్రను, ఆవిడ బలాలు - బలహీనతలను ఆవిష్కరించారు. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు... వినోదం కూడా ఉంది. చంద్ర సూపర్ పవర్స్ సన్నీకి తెలిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు గానీ నవ్విస్తాయి. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ కథను డామినేట్ చేయకుండా ఎలివేట్ చేశాయి. దుల్కర్ సల్మాన్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

'కొత్త లోక 1: చంద్ర'లో సూపర్ విమెన్‌కు ధీటైన సూపర్ విలన్ ఎవరూ లేరు. ఆ విషయంలో సినిమా కాస్త డిజప్పాయింట్ చేస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ వరకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఎంగేజ్ చేశారు కానీ నీలి / చంద్రను సవాల్ చేసే విలన్ లేకపోవడం సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో కనిపించే బ్రెత్ టేకింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ లేవు. తెలుగు డబ్బింగ్ ఓకే. కానీ, సాంగ్స్ విషయంలో సరైన కేర్ తీసుకోలేదు. తెలుగు లిరిక్స్ సరిగా వినిపించలేదు. జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతం బావుంది.

Also Read: 'పరమ్ సుందరి' రివ్యూ: కాంట్రవర్సీలకు కారణమైన బాలీవుడ్ మూవీ - మలయాళీగా జాన్వీ ఎలా నటించింది? సినిమా ఎలా ఉంది?

సినిమా చూస్తున్నంత సేపూ చంద్ర పాత్ర మాత్రమే కనిపిస్తుంది తప్ప కల్యాణి ప్రియదర్శన్ గుర్తుకు రారు. అంతలా తనను తాను మలుచుకున్నారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేదు. ఆవిడ కిల్లర్ లుక్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్. కళ్ళతో హావభావాలు చూపించారు. సూపర్ హీరో సినిమా చేసిన అనుభవం టోవినో థామస్ సొంతం. ఈ సినిమాలో క్యారెక్టర్ అది కాదు. కానీ, ఆయన కనిపించినప్పుడు మంచి వినోదం పండింది. అమాయకుడైన యువకుడిగా నస్లీన్‌ చక్కగా నటించారు. నాచియప్ప గౌడ పాత్రలో శాండీ నటన రిజిస్టర్ అవుతుంది. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.

నేటివిటీతో కూడిన ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా 'కొత్త లోక 1: చంద్ర'. సరికొత్త ఇండియన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో తొలి అడుగు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. కథలో మైథాలజీ ఉంది, ఓ కొత్త పాయింట్ ఉంది. సినిమాలో వినోదం ఉంది. మాంచి థ్రిల్స్ - యాక్షన్ ఉన్నాయి. అన్నిటికీ మించి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంది. డోంట్ మిస్ ఇట్.

Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?