అమ‌లాపురం: గోదావ‌రి జిల్లాలో అన్నీ ప్ర‌త్యేకత సంత‌రించుకుంటుంటాయి.. అది ఆధ్యాత్మిక ప‌రంగానైనా.. లేదా సాంస్కృతి, సంప్రదాయ ప‌రంగానైనా ఏదైనా స‌రే గోదావ‌రి నీర‌టువంటిది మ‌రి.. ఆప్యాయ‌త‌లు, అనురాగాల‌కైనా లేదా ఆతిధ్యానికైనా స‌రే ఆయ్‌.. మా ప్ర‌త్యేక అంతేనండి.. ఆయ్‌.. అనే విధంగా ఉంటుంది.. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్ర‌తిష్ట విష‌యంలో మ‌రీ దూసుకుపోతుంటారు.. అది కాస్త ఆధ్మాతిక‌త విష‌యంలో అయితే ప్ర‌తిష్ట కంటే కూడా ఆ ఆధ్మాత్మిక‌త‌లో ప‌ర‌వ‌శించేవిధంగా లీన‌మై పోతుంటారు. అందుకే గ‌ణ‌ప‌తి ల‌డ్డూ వేలంపాటలో అయినా క‌న‌క మ‌హాల‌క్ష్మి అవ‌తారాన్ని కోట్ల రూపాయ‌ల‌తో అలంక‌రించే విష‌యంలోనైనా.. ఏదైనా స‌రే త‌మ ప్ర‌త్యేక‌త‌ను చూపిస్తుంటారు.

దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా అమ‌లాపురం ప‌ట్ట‌ణంలో వేంచేసిన శ్రీమహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు నిర్వ‌హించిన‌ వేలంపాటలో ఆన్‌లైన్‌లో పాల్గొని మ‌రీ రూ.ల‌క్ష కంటే ఎక్కువ చెల్లించి దండ‌ను ద‌క్కించుకున్నాడో భ‌క్తుడు.. ఆ భ‌క్తుడు కూడా కోన‌సీమ‌కు చెందిన వారే విశేషం..

అమ్మ‌వారి మెడ‌లో పూల‌దండ వేసేందుకు వేలం పాట‌..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న శ్రీమహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు గ‌త కొంత కాలంగా వేలంపాట నిర్వ‌హిస్తున్నారు కమిటీ సభ్యులు. ఈ ఏడాది కూడా న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అమలాపురం రవణం వీది లో ఉన్న శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి మెడలో పూల దండ వేసేందుకు వేలం పాట నిర్వ‌హించారు. అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ వేసేందుకు వేలంపాటలో రూ. లక్ష ఐదు వేలు అత్యధికంగా పాడి పూల దండ ను దక్కించుకున్నారు హైదారాబాద్ కు చెందిన ఆకుల లక్ష్మణరావు అనే భక్తుడు. ఈయ‌నది స్వ‌స్థ‌లం అమ‌లాపురం కాగా హైదారాబాద్ లో స్థిర‌ప‌డ్డారు. వేలం పాట గురించి త‌మ బంధువులు ద్వారా తెలుసుకున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వేలంపాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూల దండ దక్కించుకున్నారు.

దండ‌ను ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డ్డ భ‌క్తులు..

ఈసారి అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండకు వేలంపాట నిర్వహిస్తున్నరు కమిటీ సభ్యులు. 12 సంవత్సరాల క్రితం రూ. 4 వేలు పలికిన పూలదండ ప్రతి ఏటా వేరుగుతూ ఈసారి లక్ష ఐదు వేల రూపాయలకు చేరింది. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి పూలదండ వేయనున్నారు భక్తుడు లక్ష్మణరావు.
సాధారణంగా వినాయక చవితి లో స్వామీ వారి లడ్డూ కు లేదా అమ్మవారి వచ్చిన చీరలకు వేలం పాట పెట్టీ అమ్ముతారు కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం.

రూ. 4. 44 కోట్ల‌ నూతన కరెన్సీతో అమ్మ‌వారికి అలంక‌ర‌ణ‌..

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా ద‌ర్శ‌నం ఇచ్చిన నేప‌థ్యంలో ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంక‌రించారు. రూ. 4కోట్ల 41లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో అమ్మ‌వారిని, ఆలయం ముఖ మండపం, అంతరాలయం, ఘర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మ వారిని తండోపతండాలుగా వ‌చ్చి ద‌ర్శించుకున్నారు.