ముమ్మిడివరం: మందు బాబులు కాస్త డోస్ ఎక్కువైతే తామేం చేస్తారో వారికే తెలియ‌దు. అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైనా స‌రే వెయ్యి ఏనుగుల బ‌లం తెచ్చుకున్న‌ట్లుగా భావిస్తారు. సాహ‌సం చేయ‌రా డింభ‌కా అన్న చందంగా చిత్ర విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటారు.. లోప‌ల‌కు వెళ్లిన మందు ప్రభావం అటువంటిది మ‌రి... చుక్క మందు ప‌డితే చుక్క‌ల్లో తేలిపోతూ వారు చేసే ప‌నులు చివ‌ర‌కు విక‌టించి ప్ర‌మాదాల్లోకి చిక్కుకున్న సంద‌ర్భాలు మ‌నం చాలా వ‌ర‌కు చూస్తుంటాం.. స‌రిగ్గా అటువంటి సంఘ‌ట‌నే అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకుంది.

ఫుల్లుగా తాగిన మందుబాబు..

ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోగల పొట్టి దిబ్బకు చెందిన గొల్లపల్లి కొండ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించాడు. ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరకు వెళ్లి కోడిగుడ్డు కోసం తన చెయ్యిపెట్టాడు. ఆ సమయంలో గంప కిందున్న తాచుపాము గొల్లపల్లి కొండను ఒక్క‌సారిగా కాటువేసింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న కొండ ఆ పామును పట్టుకుని నన్నే కాటేస్తావా.. నీ అంతు చూస్తా.. అంటూ పామును మెడలో వేసుకుని గ్రామంలో వీరంగంచేశాడు.. అస‌లే తాచుపాము.. ప్ర‌మాద‌క‌ర‌మైన‌ విషసర్పం.. పామును మెడలో వేసుకుని అక్క‌డ‌ తిరుగుతున్న కొండను చూసి గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. పామును వదిలెయ్యాలని స్థానికులు కొండను హెచ్చరించినా ఆమాటలేమి లెక్కచెయ్యకుండా పామును మీపైకి వదులుతానంటూ గంతులేశాడు. మెడ‌లో తాచుపామును అటూ ఇటూ క‌దుపుతుండ‌డంతో బుస‌లు కొడుతూ క‌స్సుమ‌ని లేచి కొండను మరొకసారి పాము కాటేసింది. అయినా వ‌ద‌ల‌ని కొండ దాన్ని బూతులు తిడుతూ న‌న్నే కాటేస్తావా అంటూ వీరంగం సృష్టించాడు..

పామును చంపి, ఆసుపత్రికి వ్యక్తిని తరలించిన స్థానికులు..

నిన్నేం చేస్తానో చూడు అంటూ తనను కరిచిన ఓ తాచుపామును మెడలో వేసుకుని హల్చల్చేసిన ఓ మందుబాబు మరోసారి పాము కాటుకు గురై, ప్రమాదకర స్థితిలోకి వెళ్తుండ‌డం గ‌మ‌నించిన స్థానికులు చొర‌వ చూపి పామును క‌ర్ర‌తో కింద ప‌డేసి ఆపై కొట్టి చంపారు. అయితే మందుబాబు కొండ ప‌రిస్థితి కాసేప‌టికి విష‌మిస్తుండ‌డంతో గ‌మ‌నించిన స్థానికులు హుటాహుటీన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొండను టి. కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు. ప్ర‌స్తుతం కొండ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.