న‌వ‌మాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల‌లు ఆ త‌ల్లితండ్రులను వృద్ధాప్యంలో చూడ‌కుండా పొమ్మ‌నే సంఘ‌ట‌న‌లు చాలా చూస్తూనే ఉన్నాం.. క‌న్న మ‌మ‌కారంతో ఉన్న ఆస్తినంతా పిల్ల‌ల‌కు రాసిచ్చిన త‌ల్లితండ్ర‌లుకు తీరా వారి వృద్దాప్యంలో త‌మ‌ను చూసే దిక్కు లేక అనాధాశ్ర‌మాల్లోనే వారి జీవిత‌ చ‌ర‌మాంకంలో బ్ర‌తకాల్సిన ప‌రిస్తితి క‌నిపిస్తోంది.. అయితే క‌న‌క‌పోయినా వృద్ధాప్యంలో తానే దిక్క‌వుతుంద‌ని న‌మ్మిపెంచుకున్న కూతురు హ్యాండ్ ఇచ్చింది.. త‌న‌కు న్యాయం చేయాలంటూ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌ను ఆశ్ర‌యించింది ఓ వృధ్ధురాలు..

క‌న్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్ప‌ది అంటారు.. స‌రిగ్గా ఇలాగే త‌మ‌కు పిల్ల‌లు లేర‌న్న లోటు తీర్చుకునేందుకు స‌మీప బంధువుల కుమార్తెను పెంచి పెద్ద చేసి బాగా చ‌దివించి త‌మ‌కున్న ఆస్తినంతా రాసిచ్చిన త‌రువాత తీరా వృధ్యాప్యంలో చూడ‌ను పొమ్మంటుంద‌ని ఓ వృద్ధురాలు జిల్లా క‌లెక్ట‌ర్‌కు సోమ‌వారం మొగ‌ళ్ల‌మూరు గ్రామానికి చెందిన వాస‌ర్ల ల‌క్ష్మి అనే వృద్ధురాలు ప్ర‌జాఫిర్యాదుల వేదిక‌లో ఫిర్యాదు చేసింది.. త‌న భ‌ర్త ఉండ‌గా ఇద్ద‌రం కలిసి వ‌చ్చి త‌మ పెంపుడు కుమార్తెపై ఫిర్యాదు చేశామ‌ని, అయితే ఇప్ప‌టికీ త‌న‌కు న్యాయం చేయ‌లేద‌ని ఆ వృద్ధురాలు వాపోయింది..

వృద్ధాప్యంలో చూస్తుంద‌ని న‌మ్మాం..

మొగళ్ల‌మూరు గ్రామానికి చెందిన వాస‌ర్ల వెంక‌ట న‌ర్స‌య్య, ల‌క్ష్మీ దంప‌తులమైన తాము త‌మ పెంపుడు కుమార్తె వాసంశెట్టి జ్యోతి అనే ఆమెపై గ‌తంలో ఫిర్యాదు చేశామ‌ని, అయితే ఇటీవ‌ల ఆమె వేధింపులు మ‌రింత ఎక్కువై మాన‌సిక వేద‌న‌కు గురైన‌ త‌న భ‌ర్త మృతిచెందాడ‌ని, ఒంటరిగా మిగిలిన‌ త‌న‌కు త‌న భ‌ర్త క‌ష్టార్జిత‌మైర‌న ఆస్తిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాల‌ని వృద్ధురాలు వాస‌ర్ల ల‌క్ష్మి ఫిర్యాదులో పేర్కొంది.. తన భ‌ర్త ఆసుప‌త్రి పాలైన స‌మ‌యంలో క‌నీసం వ‌చ్చి చూడ‌లేద‌ని, ఆయ‌న మృతిచెందాక వ‌చ్చి ఆస్తి కోసం త‌న‌ను ధూషిస్తూ గొడ‌వ‌కు దిగింద‌ని తెలిపింది.. త‌న భ‌ర్త మృతిచెంది ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తున్న వృద్ధురాలినైన‌ త‌న‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వేగంగా విచార‌ణ పూర్తిచేసి త‌న భ‌ర్త ఆమెకు రాసిచ్చిన రెండున్న‌రెక‌రాల దానసెట‌ల్మెంట్ రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దుచేసి త‌న‌కు ఇప్పించాల‌ని కోరింది.. అంతే కాకుండా ఒంట‌రిగా జీవిస్తున్న త‌న పెంపుడు కుమార్తె నుంచి త‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది..

అవ‌స‌ర‌మైతే ఆస్తి ప్ర‌భుత్వానికి రాసిస్తా..

పెంచుకున్న కూతురు వ‌ల్ల అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని, అటువంటి దానికి త‌న ఆస్తిలో చిల్లిగ‌వ్వ కూడా ద‌క్క‌డానికి వీలు లేద‌ని వృద్ధురాలు ల‌క్ష్మి తెలిపింది.. త‌న పెంపుడు కుమార్తె వేధింపుల వ‌ల్ల‌నే త‌న భ‌ర్త బెంగ పెట్టుకుని అనారోగ్యం పాలై మృతిచెందాడ‌ని, లేక పోతే ఇంకా బ్ర‌తికే ఉండేవాడంటుంది.. త‌న అనంత‌రం అవ‌స‌ర‌మైతే త‌న ఆస్తినంతా ప్ర‌భుత్వానికి రాసివ్వాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌ని ఈ వృద్ధురాలు తెలిపింది.