తిరువూరు: నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఘటన తర్వాత తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ ఆఫీసు నుండి మధ్యాహ్నం నుండే జనాన్ని సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయని టీడీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిఘా వర్గాల ద్వారా తన గన్ మెన్‌కు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వచ్చాయని, అయినప్పటికీ తనకు ఎందుకు అదనపు భద్రత కల్పించలేదని, కనీసం ఒక కానిస్టేబుల్‌ను కూడా అదనంగా ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. నెమలి కళ్యాణం సమయంలో కరెంట్ తీసివేసి తనపై దాడి చేయాలని ప్లాన్ చేశారని, కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదని తనకు తెలిసిందని చెప్పారు. తన కారు అద్దాలు పగలగొట్టి, టైర్ల గాలి తీసి దాడి చేయాలని చూశారనే స్పష్టమైన సమాచారం తనకుందని ఆయన వెల్లడించారు.

మాఫియాపై పోరాటం వల్లే దాడులా?
గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోరాడినప్పుడు కూడా తనపై ఇటువంటి దాడులు జరగలేదని కొలికపూడి గుర్తుచేశారు. పేకాట క్లబ్బులు మూయించినందుకు, రేషన్ బియ్యం అక్రమంగా తరలించడాన్ని అడ్డుకున్నందుకు తనపై దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాఫియా ద్వారా నెలకు కోటి రూపాయలు మేస్తున్న పందికొక్కులను ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మండలం స్థాయి నాయకుడు తనను తిడుతూ వీడియో పెడితే అది ఎంపీ (కేశినేని చిన్ని)కి నచ్చలేదని, మళ్ళీ గట్టిగా తిడుతూ మరో వీడియో పెట్టించారని ఆరోపించారు. ఏ కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు పిక్లా నాయక్ మాట్లాడుతూ తనను భూమి మీద లేకుండా చేస్తానన్నారని, అంటే తనను చంపేయాలని చూస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ, వ్యక్తిగత విమర్శలు
ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్నిని తనకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేదని, కానీ వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. తన ఫోటోలను మార్పింగ్ చేసిన వారి వివరాలు తన వద్ద ఉన్నాయని, తన చిట్టా ఉంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. తనకు చిన్నప్పటి నుండి మద్యం అలవాటు లేదని, తన ఆస్తి కేవలం తన 'క్యారెక్టర్' మాత్రమేనని ఆయన చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడా కులం కార్డు వాడలేదని, పార్టీ, ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. అమాయకులపై రాజకీయ ఒత్తిళ్లతో ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, తన నియోజకవర్గంలో ఇతరులు వేలు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కొలికపూడి విజ్ఞప్తి
తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనితలకు విజ్ఞప్తి చేస్తూ, తనను భూమి మీద లేకుండా చేయడానికి జరుగుతున్న కుట్రలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వ్యక్తిగత కక్షలతో దాడులకు ప్రయత్నిస్తే తాను దేనికీ భయపడనని, తనను అవమానిస్తే సహిస్తాను కానీ తన జాతిని అవమానిస్తే తెగిస్తానని ఆయన హెచ్చరించారు.