Kisan Credit Card Scheme: దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులకు ఊరట కల్పించే వార్తను ఆర్బీఐ వెల్లడించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని సరళీకృతం చేయడానికి, మరింతగా రైతులకు అనుకూలంగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేసింది. రైతులు రుణాలు పొందడంలో ఇబ్బందులు తొలగించి, సకాలంలో నిధులు అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి ఈ పథకానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తామని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ చర్య రైతులు, కార్మికులు, వ్యవసాయం చేస్తున్న చిన్న రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

RBI కొత్త పథకం కింద, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిధిని విస్తరిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఉన్న రూల్స్‌ అన్నింటికి ఒకే విధానంలోకి తీసుకురానున్నారు. వాటిని అప్‌డేట్ చేస్తారు. ఇందులో ఉండే రూల్స్‌ను అర్థం చేసుకోవడంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. అందుకే వీటిని సరళీకరిస్తే బ్యాంకులు సులభంగా రుణాలు అందించగలవని భావిస్తున్నారు.

పంట సీజన్ల సర్దుబాటు, KCC కాలపరిమితిని పొడిగించడం, ప్రతి పంట సైకిల్‌ ఆధారంగా రుణ పరిమితులను నిర్ణయించడం వంటి మార్పులు కొత్త మార్గదర్శకాల్లో చేర్చనున్నారు. దీని వల్ల పద పదే అప్లై చేయాల్సిన అవసరం ఉండదని, అవసరమైనప్పుడు నిధులను సులభంగా పొందేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.

కెసిసి పదవీకాలాన్ని 6 సంవత్సరాలకు పొడిగించే ప్రతిపాదన

ఇప్పటి వరకు, కిసాన్ క్రెడిట్ కార్డుల చెల్లుబాటు వ్యవధి పరిమితంగా ఉండేది. కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం, దానిని ఆరు సంవత్సరాలకు పొడిగించాలని చూస్తున్నారు. దీనివల్ల రైతులు ప్రతి సంవత్సరం కొత్త కార్డు పొందాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా పదే పదే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు. ఒకే కార్డును దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల వ్యవసాయ ప్రణాళిక కూడా సులభతరం అవుతుంది.

టెక్నాలజీ ఖర్చులు ఆమోదం.

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వేగంగా పెరుగుతోంది. రైతులకు బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, చిన్న వ్యవసాయ యంత్రాలు, డిజిటల్ పరికరాలను చాలా వరకు వ్యవసాయ దిగుబడి పెంచేందుకు రైతులు వినియోగిస్తున్నారు. RBI రూపొందిస్తున్న కొత్త మార్గదర్శకాలు KCC రుణాలలో ఈ టెక్నాలజీ సంబంధిత ఖర్చులను చేర్చాలని భావిస్తోంది. ఇది ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. రైతుల ఖర్చులను తగ్గిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏమిటి?

రైతులకు సరసమైన, ఇబ్బంది లేని రుణాలు అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశ్యం వారు తమ వ్యవసాయ అవసరాలను, తీర్చుకునేలా చేయడం. విత్తనాలు, ఎరువులు, మందులు, నీటిపారుదల, పంటకోత తర్వాత ఖర్చులు, గృహ అవసరాలకు రుణాలను సులభంగా పొందవచ్చు.

ఎంత రుణ మొత్తం అందుబాటులో ఉంది?

సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద, కిసాన్ క్రెడిట్ కార్డులపై రూ.5 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రుణాలకు వడ్డీ రేటు 7శాతంగా నిర్ణయించారు. రైతు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే, వారికి బోనస్‌గా వడ్డీ శాతాన్ని 3 శాతం తగ్గిస్తారు. అంటే సక్రమంగా రుణాలు చెల్లించే రైతులకు కేవలం నాలుగు శాతం వడ్డీతోనే రుణాలను బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది.

KCC ని ఎవరు తీసుకోవచ్చు?

కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి అనేక రకాల రైతులు ప్రయోజనం పొందవచ్చు. వీరిలో భూ యజమానులు, ఉమ్మడి రైతులు, కౌలు రైతులు, వాటాదారులు ఉన్నారు. స్వయం సహాయక బృందాలు (SHGలు), ఉమ్మడి రైతుల సమూహాలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి.