Kia Cars Extended Warranty Diwali Discounts: కియా ఇండియా, తన ప్రముఖ కార్లు - Seltos, Sonet, Syros & Carens Clavis మోడళ్లకు 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కొత్తగా కారు కొనేవాళ్లు & ఇప్పటికే కారు కొన్నవాళ్లు - ఇద్దరూ ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అదనంగా, దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని, కియా, తన కార్లపై ₹1.60 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

7 ఏళ్ల వారంటీ ప్రోగ్రామ్‌ వివరాలు
కియా ప్రస్తుతం 3 ఏళ్ల స్టాండర్డ్‌ వారంటీని అందిస్తోంది. కానీ ఈ కొత్త ఆఫర్‌ ద్వారా కస్టమర్లు వారంటీని 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ ఉన్న కస్టమర్లు “5+2 ఇయర్స్‌” అప్‌గ్రేడ్‌ ప్లాన్‌ ద్వారా కేవలం రూ. 32,170 (పన్నులు మినహా) చెల్లించి 7 సంవత్సరాలకు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లకు పూర్తి 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ ప్లాన్‌ ధర రూ. 47,249 (పన్నులు మినహా).

కియా వారంటీలో ఏమేం కవర్‌ అవుతాయి?
ఈ వారంటీ ప్రోగ్రామ్‌ ద్వారా, కారు మెకానికల్‌ లేదా ఎలక్ట్రికల్‌గా ఫెయిల్‌ అయితే (రిపేర్లు వస్తే), అవి వారంటీ కవరేజ్‌లోకి వస్తాయి. అంతేకాదు, వాహనం అమ్మినప్పుడు కూడా ఈ వారంటీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అంటే, కియా కార్ల రీసేల్‌ విలువ కూడా పెరుగుతుంది.

ప్రస్తుతం 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని హోండా, రెనాల్ట్‌, టయోటా వంటి బ్రాండ్లు కూడా అందిస్తున్నాయి.

దీపావళి ఆఫర్లు - రూ. 1.60 లక్షల వరకు తగ్గింపు

కియా డీలర్‌షిప్‌లు దేశవ్యాప్తంగా దీపావళి ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. GST 2.0 సవరణల కారణంగా ధరలు తగ్గిన నేపథ్యంలో, ఈ ఆఫర్లు మరింత ఆకర్షణీయంగా మారాయి.

Kia Syros - రూ. 1.60 లక్షల వరకు తగ్గింపు
సైరోస్‌ SUV ధరలు రూ. 8.67 లక్షల నుంచి రూ. 15.94 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులో 120hp 1.0L టర్బో పెట్రోల్‌ & 116hp 1.5L డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ రెండూ అందుబాటులో ఉన్నాయి.

Kia Seltos - రూ. 1.47 లక్షల వరకు తగ్గింపు
సెల్టోస్‌ ధరలు రూ. 10.79 లక్షల నుంచి రూ. 19.81 లక్షల వరకు ఉన్నాయి. 1.5L నేచురల్‌ పెట్రోల్‌, 1.5L టర్బో పెట్రోల్‌, 1.5L డీజిల్‌ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో కూడిన టర్బో వేరియంట్‌లు ఎక్కువగా డిమాండ్‌లో ఉన్నాయి.

Kia Carens & Carens Clavis - రూ. 1.42 లక్షల వరకు తగ్గింపు
కారెన్స్‌ ప్రీమియం (O) వేరియంట్‌ రూ. 10.99 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. క్లావిస్‌ ధర రూ. 11.08 లక్షల నుంచి రూ. 20.71 లక్షల వరకు ఉంది. వీటిలో 1.5L పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌ ఆప్షన్లు ఉన్నాయి.

Kia Sonet - రూ. 1.03 లక్షల వరకు తగ్గింపు
సోనెట్‌ కాంపాక్ట్‌ SUV ధరలు రూ. 7.30 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు ఉన్నాయి. 1.2L పెట్రోల్‌, 1.0L టర్బో పెట్రోల్‌, 1.5L డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో ఇది లభిస్తోంది. ఇది యువతలో అత్యంత పాపులర్‌ మోడల్‌.

కియా ఇండియా, ఈ పండుగ సమయంలో, ఈ రెండు ఆఫర్లతో (7 ఏళ్ల వారంటీ & దీపావళి డిస్కౌంట్లు) కస్టమర్లకు డబుల్‌ బెనిఫిట్‌ ఇచ్చింది.