PJR Daughter Vijaya Reddy Congress Candidate: ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖాయం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అత్యంత వ్యూహాత్మకంగా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైకోర్టు అనర్హత వేటుతో ఈ స్థానంలో ఎన్నిక ఖాయం కావడంతో.. పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కే తిరిగి కాంగ్రెస్ బి-ఫామ్ ఇస్తారని అంతా భావించారు. అయితే, మారుతున్న పరిస్థితులు, క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను గమనిస్తున్న కాంగ్రెస్ మున్సిపల్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ స్ట్రాటజీ టీమ్స్ మాత్రం ఊహించని ప్లాన్-బి పై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఓటర్లలో సహజంగానే దానంపై వ్యతిరేకత

ఈ వ్యూహాత్మక మార్పు వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి చేరడం, ఆ వెంటనే సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోవడం, ఇప్పుడు కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవడం.. ఇవన్నీ దానం నాగేందర్‌కు కొంత ప్రతికూలంగా మారాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు మళ్లీ ఆయననే ఉపఎన్నికల బరిలోకి దింపితే, ప్రతిపక్షాలైన బిఆర్‌ఎస్, బిజెపిలు అవకాశవాద రాజకీయం పేరిట తీవ్రంగా ఎండగట్టే అవకాశం ఉందని, ఇది ఓటర్లలో ప్రతికూల భావనను పెంచుతుందని గాంధీభవన్ నేతలు అంతర్గత విశ్లేషణల్లో హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేరు పరిశీలన

ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఖైరతాబాద్‌లో దివంగత సీనియర్ నేత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె, జీహెచ్‌ఎంసీ విజయా రెడ్డి ని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పిజెఆర్ కుటుంబానికి, ఆయన ఇమేజ్‌కు నేటికీ చెక్కుచెదరని ప్రజాదరణ ఉంది. నగర పరిధిలోని బస్తీలు, దిగువ మధ్యతరగతి వర్గాల్లో పిజెఆర్ పేరు ఇప్పటికీ మారుమోగుతుంది. విజయారెడ్డి స్వయంగా కార్పొరేటర్‌గా సేవలందించడం , వివాదరహితురాలిగా పేరుండటం వల్ల ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తే సింపతీ తో పాటు సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ఏకతాటిపైకి వస్తుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.

దానం అంగీకరిస్తారా?

ఈ ప్లాన్-బి అమల్లోకి రావాలంటే అతిపెద్ద సవాలు దానం నాగేందర్‌‌ను ఒప్పించడం! దానం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఖైరతాబాద్‌ను సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారు. ఉపఎన్నికలో పోటీ చేసి తన ఉనికిని చాటుకోవాలని తాపత్రయపడుతున్న వేళ, తన స్థానంలో విజయారెడ్డికి టికెట్ ఇస్తే ఆయన ఊరుకుంటారా అనేది సంచలనంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్, మంత్రి హోదా పదవి ఆఫర్ చేసి శాంతింపజేసే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో దానం వర్గీయులు విజయారెడ్డి గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రచారం బయటకు రావడంతో బిఆర్‌ఎస్, బిజెపిలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

సమీకరణాలు తేడా వస్తే నష్టమే

విజయారెడ్డి పోటీలోకి వస్తే, కమ్యూనిటీ ఓటింగ్, బస్తీ ఓట్లు ఏకీకృతమై కాంగ్రెస్‌కు విజయావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నప్పటికీ, అంతర్గత తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేయడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారనుంది. ఖైరతాబాద్ ఉపఎన్నిక కేవలం ఒక స్థానానికి జరిగే పోరు మాత్రమే కాకుండా, కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి మరియు పార్టీ వ్యూహకర్తల చాకచక్యానికి ప్రతీకగా మారబోతోంది. దానం నాగేందర్ కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదనకు తలొగ్గి విజయారెడ్డికి సహకరిస్తారా, లేక తన మార్కు పట్టుదలతో తనకే టికెట్ కావాలని భీష్మించుకూర్చుంటారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది.