తిరువూరు టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గంపలగూడెం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌నతో మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచారు. స్వామి వారికి స‌మర్పించే ప‌ట్టు వ‌స్త్రాలను ఎంపీ కేశినేని శివ‌నాథ్ వద్ద నుంచి ఎమ్మెల్యే కొలిక‌పూడిశ్రీనివాస‌రావు లాక్కోవడంతో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాసరావు దూకుడు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సంయమనం పాటించి, భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించారు.

పట్టువస్త్రాల సమర్పణలో మొదలైన రచ్చ
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ కుటుంబాలతో కలిసి సోమవారం రాత్రి ఒకే సమయంలో హాజరయ్యారు. ఆలయ మర్యాదలలో భాగంగా అధికారులు పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించగా, తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపూడికి ఇచ్చారు. అయితే, ఎమ్మెల్యే కొలికపూడి స్వామివారి పట్టువస్త్రాలను తనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. వివాదం ఇష్టం లేక ఎంపీ తన చేతిలోని వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇచ్చేసి, మాట మాట్లాడకుండా పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి చేతిలోని పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో ఆలయంలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సాధారణ భక్తులతో కలిసి కూర్చున్న ఎంపీ.. వేదికపై ఎమ్మెల్యే
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ సంయమనం పాటించారు. ఎలాంటి గొడవ జరగడం తనకు ఇష్టం లేదంటూ తన అనుచరులను వారించి భక్తుల మధ్య కూర్చుని నెమలి వేణుగోపాలస్వామి కల్యాణాన్ని వీక్షించారు. వివాదాలు వద్దని, తాను అక్కడి నుంచే స్వామిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి తన కుటుంబంతో కలిసి వేదిక మీద కూర్చున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకుల వ్యాఖ్యలతో రెచ్చపోయిన ఎమ్మెల్యే కొలికపూడి, వెనుక కూర్చున్న ఎంపీ కేశినేని చిన్ని వైపు చూస్తూ పరుష పదజాలంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ ఎంపీ కేశినేని చిన్ని మాత్రం ఏమాత్రం స్పందించకుండా, ప్రశాంతంగా వేడుక ముగిశాక మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం భక్తులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది.