కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ వివాదాలకు ఎట్టకేలకు తెరపడింది. కొలికపూడితో మంతెన సత్యనారాయణ రాజు భేటీ అయి, పార్టీలో దీనిపై ఉన్న సీరియస్ నెస్, రాజకీయంగా కలిగే నష్టాలను చర్చించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం ఈ వివాదాలపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. తిరువూరులో నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలన్నీ ముగిసినట్లేనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్టకు ఏవైనా ఇబ్బందులు కలిగించి ఉంటే తాను చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

అధికార ప్రోటోకాల్, పరస్పర గౌరవం గురించి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇస్తానని, అదే సమయంలో ఆయన నుంచి కూడా తాను అదే గౌరవాన్ని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం కార్డును వాడటం తన అభిమతం కాదని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

కొలికపూడి చేసిన ఆరోపణలు.. స్పందించిన పార్టీ అధిష్టానం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ప్రాణాలకు ముప్పు ఉందని గురువారం ఆరోపించారు. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన ఘటనను ఉటంకిస్తూ, తనపై దాడి చేసి చంపేందుకు పక్కా ప్రణాళిక జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కార్యాలయం నుంచే మధ్యాహ్నం నుండి జనాన్ని సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయని, తనను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నారని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం స్పందించింది. ఇది వ్యక్తిగతంగానే కాదు, పార్టీకి నష్టం కలిగిస్తుందని.. విభేదాలు మంచిది కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం తీరుపై కూడా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల ద్వారా తన గన్ మెన్‌కు ముందస్తు హెచ్చరికలు అందినప్పటికీ, తనకు కనీసం ఒక అదనపు కానిస్టేబుల్‌ను కూడా భద్రతగా కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణం సమయంలో కరెంట్ తీసివేసి చీకట్లో తనపై దాడి చేయాలని ప్లాన్ చేశారని, అయితే పోలీసులు అందుకు నిరాకరించడం వల్ల ప్రమాదం తప్పిందని తనకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు.

తన కారు అద్దాలు పగలగొట్టి, టైర్ల గాలి తీసి తనను అడ్డుకుని భౌతిక దాడి చేయాలని చూశారనే స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో చెప్పారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా తనకు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.