Kerala Assembly Election Results Congress defeat Left alliance: కేరళ రాజకీయ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దశాబ్ద కాలంగా సాగిన ఎల్‌డీఎఫ్ పాలనకు స్వస్తి పలుకుతూ, కేరళ ఓటర్లు మళ్లీ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు. "ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పు" అనే కేరళ సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో చెరిపివేసి చరిత్ర సృష్టించిన పినరయి విజయన్, ఈసారి మాత్రం ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు.

పినరయి విజయన్ వ్యక్తిగత వైఖరి పై వ్యతిరేకత

ముఖ్యమంత్రి పినరయి విజయన్ శైలి మొదటి నుంచీ నియంతృత్వ ధోరణితో సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన మాటే శాసనం కావడంపై ప్రజల్లో అసహనం పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆయన కార్యాలయం చుట్టూ తిరిగిన వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. కెప్టెన్ అని అభిమానులు పిలుచుకునే విజయన్, ఈసారి ప్రజలకు అందుబాటులో లేని నేత గా మారిపోవడం ఎల్‌డీఎఫ్ పతనానికి ప్రధాన కారణమైంది.

వ్యవస్థీకృత అవినీతి , ఆర్ధిక సంక్షోభం

కేరళ ఆర్ధిక పరిస్థితి గతేడాది కాలంగా అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యం, సామాజిక పెన్షన్ల నిలిపివేత సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీనికి తోడు కరువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్ కుంభకోణం వంటి అంశాలు కమ్యూనిస్టు పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్‌ను కూడా ఆత్మరక్షణలో పడేశాయి. సామాన్యుడి సొమ్ముకు భద్రత లేదనే భావన ఓటర్లను యూడీఎఫ్ వైపు మళ్లించింది.

యూడీఎఫ్ సమష్టి నాయకత్వం - సతీశన్ ఎఫెక్ట్

కాంగ్రెస్ పార్టీ గతంలోలా కాకుండా ఈసారి చాలా ఐక్యంగా పోరాడింది. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేరళ పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ద్వయం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా వీడీ సతీశన్ అసెంబ్లీలోనూ, బయటా ఒక గంభీరమైన ప్రత్యామ్నాయ నేతగా తనను తాను మలుచుకున్నారు. ఉమెన్ చాందీ లేని లోటును అనుభవం కలిగిన సీనియర్లు, ఉత్సాహవంతులైన యువనేతలు భర్తీ చేస్తూ సమష్టిగా వెళ్లడం యూడీఎఫ్‌కు ప్లస్ అయ్యింది.

మైనారిటీ ఓట్ల పోలరైజేషన్

కేరళలో గెలుపోటములను శాసించే ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు ఈసారి యూడీఎఫ్ వైపు బలంగా నిలిచింది. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైపు మొగ్గు చూపిన క్రైస్తవ వర్గాలు, ఈసారి రబ్బరు ధరల పతనం , మతపరమైన సమీకరణాలతో మళ్లీ యూడీఎఫ్ గూటికి చేరాయి. ముస్లిం లీగ్ తన మలబార్ కోటను పటిష్టం చేసుకోవడమే కాకుండా, సెక్యులరిజం విషయంలో కాంగ్రెస్‌నే నమ్మదగిన శక్తిగా ఆయా వర్గాలు గుర్తించాయి.

యువతలో అసహనం - నిరుద్యోగం

కేరళలో నిరుద్యోగితా రేటు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో తమ అనుచరులకే ప్రాధాన్యత ఇస్తుందనే ఆరోపణలు యువతను కమ్యూనిస్టులకు దూరం చేశాయి. విద్యావంతులైన కేరళ యువత మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లాల్సి రావడంపై యూడీఎఫ్ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో పనిచేసింది. మార్పుతోనే ఉపాధి అనే నినాదం యువ ఓటర్లను ఆకర్షించింది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు యూడీఎఫ్ అభ్యర్థులకు బదిలీ అయ్యాయి. ఎల్‌డీఎఫ్‌ను ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. త్రిముఖ పోటీ జరిగిన చోట కూడా బీజేపీ ఓట్లు చీలిపోకుండా ఉండటం పరోక్షంగా కాంగ్రెస్ కూటమికి కలిసి వచ్చింది.

కేరళ ఓటర్లు ఎప్పుడూ అతిగా అధికార గర్వం ప్రదర్శించే వారిని సహించరు. పినరయి విజయన్ సర్కార్ గత విజయం ఇచ్చిన అతివిశ్వాసంతో ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆర్థిక నిర్వహణలో విఫలమవ్వడం యూడీఎఫ్‌కు మార్గం సుగమం చేశాయి. దశాబ్ద కాలం తర్వాత అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న యూడీఎఫ్ ముందు ఇప్పుడు సవాళ్లు కొండంత ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.