అక్టోబరు 27 కార్తీకపురాణం ఆరవ అధ్యాయం

వశిష్ఠుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నారు..
ఓ జనకమహారాజా కార్తీక మాసమందు భక్తితో నెలంతా హరికి కస్తూరి, గంధం, పంచామృతాలతోను స్నానము చేయించేవారు పదివేల అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సాయంకాలం హరిసన్నిధిలో దీప దానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈ నెలలో దీపదానం చేసినవారు జ్ఞానవంతులై విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీకమాసంలో ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తినిచేసి బియ్యపు పిండితోగాని, గోధుమపిండితోగాని పాత్రనుజేసి ఆవునెయ్యివేసి వత్తినితడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఈ నెలంతా రోజూ ఈ విధానాన్ని అనుసరించి నెలచివర్లో వెండి ప్రమిదలో బంగారువత్తిని ఉంచి బియ్యపు పిండి మధ్యలో ఉంచి పూజించి నివేదించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీపదానం చేయాలి.

సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||

మంత్రార్థము దీపం సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకం. అందుకే దీపదానమును జేయుచున్నాను. ఈ దీనివల్ల నాకు నిరంతరముశాంతి గలుగుగాక. ఈ ప్రకారంగా స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసంలో అనుసరిస్తే అనంతఫలం పొందుతారు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయ ములచేత చేయబడిన తెలిసి తెలియక జేసిన పాపములు నశించును. దీనికి సంబంధించి ఓ ఇతిహాసం చెబుతాను వినమని చెప్పసాగెను.

లుబ్ధ వితంతువుకు స్వర్గ ప్రాప్తి

పూర్వ కాలంలో ద్రవిడ దేశంలో ఓ గ్రామంలో ఓ స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొన్నిరోజులకే భర్త చనిపోయెను. సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుకే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేస్తూ అక్కడే భోజనం చేసేది. వారి సంతోషంతో ఏవైనా వస్తువులిస్తే వాటిని ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకుని ఆ సొమ్మును వడ్డీలకు ఇచ్చి ధనం కూడబెట్టేది. ఎవరైనా దొంగిలించిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము కూడబెట్టేది. ఈ విధముగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇంట్లో దాసిపనులు చేస్తూ రోజులు గడిపేసేది. ఎంత సంపాదించినా కానీ ఒక్కరోజైనా భగవంతుని ధ్యానం, ఉపవాసం అనేదే ఆచరించేది కాదు. వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసేది. బిచ్చగాడికి కూడా బిచ్చం వేసేది కాదు. అలా కొంతకాలం తర్వాత ఓ రోజు ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చారు. ఆ రోజు అక్కడే ఉన్న ఓ సత్రంలో బసచేశారు. ఆగ్రామంలో మంచిచెడులు తెలుసుకుని ఆ పసినారి స్త్రీ గురించి కూడా తెలుసుకుని అక్కడకు వెళ్లారు.

"అమ్మా! నా హితవచనము విను. మన శరీరం శాశ్వతంకాదు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో అయినా మృత్యువు మనల్ని తీసుకుని పోతుంది. పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మించిన ఈ శరీరంలో ప్రాణం - జీవం పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. ఇలాంటి శరీరాన్ని నిత్యం అని నువ్వు భ్రమిస్తున్నావు, ఇది అజ్ఞానము తల్లి ఆలోచించుకో అని చెప్పారు. తినక, దానం చేయక సంపాదించిన ధనాన్ని ఇప్పటికైనా పేదలకు దానం చేయమని చెప్పారు. ఇన్నాళ్లు చేసిన పాప పరిహారార్థం కార్తీకమాసంలో దానధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోమని చెప్పారు. దానధర్మాలు చేసి కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే జన్మలో నీవు పుణ్యవతిపై సకల సౌభాగ్యాన్ని పొందుతావని ఉపదేశించారు. కార్తికమాసంలో ప్రాతస్స్నానమాచరించి బ్రాహ్మణునకు దీపదానము చేయుమని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ పిసినారి వితంతువు మనసు మార్చుకుంది. కార్తీకవ్రతం చేసింది..సూర్యోదయసమయాన స్నానం, హరిపూజ, దీపదానము, పురాణ శ్రవణం చేసింది. మరణానంతరం విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖం పొందింది.

కాబట్టి కార్తికమాసమందు అన్నిటికన్నా దీపదానం అధిక పుణ్య ప్రదం అని చెప్పారు వశిష్ఠుడు.

స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరో అధ్యాయం సమాప్తం

గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

( రోజుకో కథ చదువుకుంటే మంచిది..ముందు రోజు కథ చదువుకోవడానికి ఆటంకం వస్తే.. ఆ తర్వాత రోజు అన్ని కథలు కలిపి చదువుకోవచ్చు)

కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!

కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?

కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం

కార్తీక మహాపురాణం కథ DAY-4 : కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం!