Kamareddy Rain Floods | కామారెడ్డి: వరద బాధితుల సాయం కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మొత్తం రూ. 15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంచడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఆపద సమయంలో సహాయం అందిస్తున్నందుకు మంత్రి సీతక్క ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇన్చార్జ్‌లను అభినందించారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధులు వంశీ, వినోద్‌లు మంత్రి సీతక్కను కలిసి ప్రజా భవన్‌లో సీతక్క ప్రత్యేకంగా అభినందించి, వారి త్యాగం మరియు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు ములుగు జిల్లా లో కూడా 20 లక్షల విలువైన 634 నిత్యావసర కిట్ల పంపిణీ త్వరలో చేస్తామని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది.

ఆగస్టు నెలలో వారం రోజులపాటు కుండపోత వర్షాలు కురవడంతో భారీగా ఆస్తి, నష్టం సంభవించింది. కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీటిలో మునిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు గ్రామాల్లో చెరువు, కాలువలకు గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాలుగైదు రోజులపాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారి NH44పై సైతం ఆ సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్లను ఆదేశించింది. వారు నష్టం వివరాలు అంచనా వేసి రిపోర్ట్ తయారుచేసి మంత్రులకు అందించారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడానికి చర్యలు చేపట్టింది.