Nalamasa Srikanth Goud Graduate MLC Candidate :  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన ప్రత్యక్ష ఎన్నికల ప్రస్థానానికి అత్యంత వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ గ్రహీత డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ఖరారు చేశారు. దసరా పర్వదినం శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని తమ పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న తొలి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కవిత తన రాజకీయ ముద్రను స్పష్టంగా చాటుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీలు ఇంకా సమీక్షలు, ఓటర్ల నమోదు కసరత్తుల్లోనే నిమగ్నమై ఉండగా.. అందరికంటే ముందే బహుజన సామాజికవర్గానికి చెందిన విద్యావంతుడిని బరిలో నిలిపి కవిత రాజకీయంలో తీవ్రమైన వేగాన్ని, దూకుడును ప్రదర్శిస్తున్నారు.

చురుకుగా క్షేత్ర స్థాయి రాజకీయాలు

గులాబీ పార్టీ తో తన రాజకీయ బంధం తెగిపోయిన తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేనను కేవలం ఒక ప్రాంతీయ వేదికగా కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేందుకు కవిత అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రస్తుతం ఎదుర్కొంటుంది కేవలం నాయకత్వ లేమి మాత్రమే కాదని, క్షేత్రస్థాయి పోరాట పటిమ లోపించిందనే భావన ప్రజల్లో ఉందనేది పొలిటికల్ సర్కిళ్ల టాక్. సరిగ్గా ఈ అవకాశాన్ని పసిగట్టిన కవిత.. బిఆర్ఎస్ వదిలేసిన తెలంగాణ ఆత్మగౌరవం , బహుజన నాయకత్వం, ఉద్యమకారుల సంక్షేమం అనే ప్రధాన అజెండాలను తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. బిఆర్ఎస్ కంటే మరింత దూకుడుగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లు, క్షేత్రస్థాయి పర్యటనలతో మీడియా అటెన్షన్‌ను సునాయాసంగా రాబట్టుకుంటున్నారు.

ఉద్యమకారునికి సీటు

తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన, తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి తనతో కలసి నడిచిన ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్‌ను ఎంచుకోవడం వెనుక సుదీర్ఘ పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం అనేది విద్యావంతులు, యువత, ఉద్యోగుల ఓట్లతో ముడిపడి ఉన్న అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇక్కడ బహుజన ఓటు బ్యాంకుతో పాటు విద్యావంతుల మద్దతు సాధించగలిగితే.. అది కొత్త పార్టీకి ఊహించని నైతిక విజయాన్ని అందిస్తుంది. గతం నుంచి బహుజనుల గొంతుకగా నిలిచిన కవిత, తన మాటలకు కట్టుబడి మొదటి అవకాశం వెనుకబడిన తరగతుల బిడ్డకే కట్టబెట్టారనే సందేశాన్ని క్యాడర్‌లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.

బీఆర్ఎస్ కంటే ముందే

బిఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి దూకడం ద్వారా కవిత తన సొంత అన్న కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలోని బిఆర్ఎస్ యంత్రాంగాన్ని ఒత్తిడిలోకి నెట్టారు. బిఆర్ఎస్ డిఫెన్సివ్ మోడ్‌లో ఉండి లీగల్ పోరాటాలు, అంతర్గత సమీక్షలకే పరిమితమైన వేళ.. కవిత మాత్రం కరీంనగర్ జిల్లా కమిటీల ఏర్పాటు, జిల్లాల పర్యటనలు , ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమించడం వంటి వరుస చర్యలతో పార్టీ యంత్రాంగాన్ని పరుగెత్తిస్తున్నారు. ఇది బిఆర్ఎస్ శ్రేణుల్లో అసలైన పోరాట పటిమ కవిత వద్దే ఉందా అనే ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో పోటీ చేయడం కవిత పార్టీకి పూలబాట ఏమీ కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ యంత్రాంగం , బలమైన నెట్‌వర్క్ ఉన్న బీజేపీ ఈ స్థానంపై కన్నేసి విస్తృతంగా ఓటర్ల నమోదు ప్రక్రియను సాగిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం నాయకుడి క్రేజ్ మాత్రమే సరిపోదు; బూత్ స్థాయిలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి, పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లే బలమైన క్యాడర్ నిర్మాణం అత్యవసరం. నిధులు, నెట్‌వర్క్ విషయంలో జాతీయ , ప్రాంతీయ దిగ్గజాలతో పోలిస్తే కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన ఎంతవరకు తట్టుకోగలదనేది ప్రధాన సవాలు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో అభ్యర్థి ప్రకటన అనేది కవిత వేసిన మొదటి పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ . ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నానని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విపక్ష కాంగ్రెస్, బీజేపీలతో పాటు సొంత కుటుంబ మూలాలున్న బిఆర్ఎస్‌కు కూడా కవిత చాలా స్పష్టమైన సంకేతాన్ని పంపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన సాధించే ఓట్ల శాతమే, రాష్ట్రీయ రాజకీయాల్లో కవిత భవిష్యత్ పాత్రను నిర్ణయించనుంది.