Kaleshwaram Restoration Works | హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారంలో ప్రారంభిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027 వర్షాకాలం నాటికి ఈ 3 బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ప్లాన్

అక్టోబర్ 5న సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి కొత్త డిజైన్లను సమర్పిస్తామని, ఆ తరువాత సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే క్షేత్రస్థాయిలో బ్యారేజీల పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. బ్యారేజీల భద్రత, నిర్మాణం నాణ్యత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన సిఫార్సులు, జాతీయ సాంకేతిక సంస్థల సూచనలు, నిపుణుల కమిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతను అత్యంత పటిష్ఠం చేస్తామని, ఈ మూడింటిలో నీటి నిల్వతో పాటు వినియోగ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం..

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ( KLIP) భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి నదిపై నిర్మించిన ఒక బహుళార్ధసాధక నీటిపారుదల ప్రాజెక్టు. ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల ప్రాజెక్టు. 2016లో శంకుస్థాపన చేయగా, తొలి దశ 2019 జూన్ 21న అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్రాజెక్టు 13 జిల్లాల గుండా సుమారు 500 కి.మీ (310 మైళ్ళు ) దూరం విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అందించడమే లక్ష్యం. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20, భూగర్భ జలాల నుంచి 25). ఇందులో 169 టీఎంసీలను రైతులకు సాగునీటి కోసం, 30 టీఎంసీలను హైదరాబాద్ నీటి అవసరాలకు, 16 టీఎంసీలను ఇతర పారిశ్రామిక అవసరాలకు, 10 టీఎంసీలను సమీప గ్రామాలకు తాగునీటి కోసం కేటాయించారు.

నీటిని ఎత్తిపోయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే 3 ప్రధాన బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023లో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడంతో ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పగుళ్లకు రిపేర్లు చేపించాలని బీఆర్ఎస్ చెబుతంటే.. భారీ స్కామ్ చేసి దోచుకున్నారని కేసీఆర్ ఫ్యామిలీ మీద కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్టు లోపాలు, నిర్లక్ష్యం, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ విమర్శలు గుప్పించడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయింది. ప్రాజెక్టు సేఫ్టీ మీద అనుమానంతోనే గత మూడేళ్లుగా బ్యారేజీల నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయని తెలిసిందే.