Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పొలాలు కొనడం ఏంటి.. ఫ్యాక్టరీ కట్టడం ఏంటి.. ఏమైనా ఉంటే న్యూస్‌లో రావాలి కదా అని అనుకుంటుంది. అంబిక అలిగి కూర్చొని ఉంటే అందరూ వెళ్లి ఏమైందని అడుగుతారు. నేనేమీ అలగలేదు అని అంబిక ఏడ్చేస్తుంది. నా మాటకు నా నిర్ణయానికి విలువ లేదు.. అసలు ఈ ఊరు రావడమే నాకు ఇష్టం లేదు.. సహస్రకు యాక్సిడెంట్ అయింది అంటేనే వచ్చా నాకు ఈ ఊరి మీద ఎలాంటి నమ్మకం లేదని అంటుంది.

పొలాలు అమ్మితే ఊరికి మంచి జరుగుతుంది. మనకు మంచి పేరు వస్తుందని మీకు చెప్పా.. అన్నయ్య పోతే నేనే బిజినెస్‌ చూసుకున్నా.. అయినా నా మాట ఎందుకు నమ్ముతారు.. ఎంతైనా ఆడపిల్ల కదా.. అదే మీ మనవడు విహారి చెప్పుంటే మాత్రం ఇన్ని అడ్డు ప్రశ్నలు వేసేవారా.. ఈ పాటికి ఎగురుకుంటూ వెళ్లి పొలాలు అమ్మేసేవారు..అక్క ఆడపిల్ల మాటలకు ఎక్కడా విలువ ఉండదు అక్క అని ఏడుస్తుంది. లక్ష్మీ మనసులో అంబికమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అనుకుంటుంది. అంబిక తండ్రితో నాన్న నువ్వేం చేస్తావో నాకు తెలీదు పొలాలు అవసరం అయితే ఊరిలో ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేద్దాం నువ్వేం చేస్తావో నాకు తెలీదు అంటుంది. దానికి భక్తవత్సలం గారు మీకు ఎవరికి అభ్యంతరం లేదు కదా నా నిర్ణయం పంచాయితీలో చెప్తా అని అంటారు.

వీర్రాజు, పార్థసారథిలు పంచాయితీ పెట్టి అందరితో అగ్రిమెంట్లు పెట్టిస్తారు. పంతులుతో సహా ఊరిలో అందరూ సంతకాలు పెట్టేస్తారు. ఇంతలో విహారి ఫ్యామిలీ మొత్తం వస్తారు. భక్తవత్సలాన్ని సంతకం పెట్టమని అంబిక, వీర్రాజు వాళ్లు చెప్తారు. వీర్రాజు సంతకం పెట్టడానికి వెళ్లి పెన్ను పక్కన పెట్టేసి అందరికీ షాక్ ఇస్తారు. పెద్దాయన్ని ఎలా ఆపాలా అనుకున్న లక్ష్మీ హ్యాపీగా ఫీలవుతుంది. ఏమైంది ఎందుకు సంతకం పెట్టడం లేదని అందరూ అడిగితే నా సంతకం చెల్లదు అని భక్తవత్సలం గారు చెప్తారు. అంబిక వచ్చి మీ సంతకం చెల్లకపోవడం ఏంటి నాన్న అని అడుగుతుంది. దానికి భక్తవత్సలం ఆ రెండు వందల ఎకరాలకు నేను యజమాని కాదు అందుకే నా సంతకం చెల్లదు అని అంటారు. ఈ మధ్య నా పొలాన్ని వేరే వారి పేరున రాసేశా అని భక్తవత్సలం అంటారు.

పద్మాక్షి వెళ్లి ఎవరి పేరు మీద రాశావ్ అని అడుగుతుంది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా ఎవరి పేరు మీద రాశావ్‌ చెప్పు పెద్ద నాన్న అని వీర్రాజు అడిగితే భక్తవత్సలం లక్ష్మీ వైపు చూపిస్తారు. 200 ఎకరాలు లక్ష్మీ పేరు మీద రాయడంతో అంబిక, వీర్రాజు, పద్మాక్షి, సహస్ర, కాదాంబరిలకు పెద్ద షాక్ తగులుతుంది. విహారి హ్యాపీగా ఫీలవుతాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ అని వీర్రాజు అంటాడు. ఏంటి ఇదంతా అని అంబిక తండ్రిని ప్రశ్నిస్తుంది. ఇదే నా నిర్ణయం ఆ రెండు వందల ఎకరాలు ఇప్పుడు లక్ష్మీవి తను ఇస్తాను అంటే మీరు తీసుకోవచ్చు అని భక్తవత్సలం అంటారు.

అందరూ భక్తవత్సలానికి సొంత వాళ్లని వదిలేసి ఆస్తి పనిమనిషి పేరు మీద రాయడం ఏంటి అని నిలదీస్తారు. మా తాత ముత్తాతల ఆస్తి మీ లాంటి వాళ్ల చేతిలో పెట్టడం కంటే లక్ష్మీ చేతిలో పెట్టడం మంచిదని అంటారు. తను మంచిది మేం అంతా చెడ్డవాళ్లం అని క్లియర్ చేశావ్ అని సహస్ర అంటుంది. దానిని తప్పించి ఎవరికీ రాసినా ఇంత ఫీలయ్యేవాళ్లం కాదని అంబిక అంటుంది. లక్ష్మీకి పొలాలు అమ్మమని అందరూ బెదిరిస్తారు. లక్ష్మీ మీదకు రౌడీలు వెళ్తే విహారి వాళ్లని చితక్కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.