Gaddars Murder | నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటనలో భాగంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ (KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీలో చేరిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ను కొందరు హత్య చేశారని, ఆయన మరణంపై సీబీఐ విచారణ జరపాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. గద్దర్ హత్యకు గురయ్యారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ చేపడితే దర్యాప్తు సంస్థలకు ఆధారాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్, ప్రధాని మోదీపై విమర్శలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇన్ హోటల్లో మాజీ సర్పంచులతో కేఏ పాల్ సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ సర్పంచులు పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ప్రజాశాంతి పార్టీలో చేరుతున్న నాయకులకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 13 నెలలైనా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రధాని మోడీ హయాంలో భారతదేశం అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. దీంతో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

మండల స్థాయి అభివృద్ధి కూడా జరగలేదని విమర్శలు

నిర్మల్ జిల్లా ఏర్పాటు అయిన కనీసం మండల స్థాయి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలేవరు నమ్మే పరిస్థితిలో లేరని, రెండు ప్రభుత్వాల హాయంలో సర్పంచ్ లు, అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. అందుకే పాలన్న రావాలి.. పాలన మారాలి.. నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. తమ పార్టీ కండువా కప్పుకొని సర్పంచ్ ఎలక్షన్లలో గెలిస్తే కేవలం 100 రోజుల్లోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులందరికి ఉద్యోగం కల్పించి చూపిస్తామన్నారు.

Also Read: Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు