తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అకాల మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా సిట్టింగ్ సీటుకు అనివార్య కారణాల వల్ల మధ్యలో ఎన్నికలొస్తే, సానుభూతి పైనే సిట్టింగ్ ఎమ్మెల్యే కు చెందిన పార్టీ ఆశలు పెట్టుకుంటుంది. అందులోనూ మాగంటి గోపీనాధ్ భార్య సునీతకు ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించడంతో సానుభూతి ఓటింగ్ పై ఇంకాస్త ఎక్కువ ఆశలే పెట్టుకుంది బీఆర్ ఎస్ పార్టీ. దీనికితోడు జూబ్లీహిల్స్ బరిలో నిలిచిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భార్య సునీత ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న తీరు, కాస్త కొత్తగా ఉంది.

సునీత కన్నీళ్లు చూసి పార్టీ నేతలు షాకవుతున్నారు

కేటీఆర్ వంటి కీలక నేతలు పాల్గొన్న బీఆర్ ఎస్ ఎన్నికల సభల్లో ఎమ్మెల్యే అభ్యర్ది సునీత భావోద్వేగం ఆపుకోలేక, భర్తను అభిమానించే కార్యకర్తలను చూసి తీవ్ర దుఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న తీరు చూసి సొంత పార్టీ నేతలే షాకవుతున్నారు. కనీసం వేదికపై నోటి నుండి మాటలు రాలేనంతగా ఆమె విలపిస్తుంటే, మాగంటి గోపీనాధ్ అభిమానులే కాదు, చూస్తున్న ఓటర్లను సైతం కలచివేస్తోంది. భర్త, పిల్లలు తప్ప ఇన్నాళ్లు రాజకీయాలను కన్నెత్తి చూడని సునీత ,ఇప్పడు ఏకంగా హోారాహోరీ పోరులో ఎమ్మెల్యేగా గెలుపు కోసం అధికార పార్టీతోనే పోటీపడుతున్నారు. కన్నీళ్లే ప్రచారాస్త్రంగా మాగంటి సునీత ప్రచారం కొనసాగుతున్న తీరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలతో విచరుకుపడుతుంటే, మరోవైపు బీఆర్ ఎస్ నేతలు,సోషల్ మీడియాలో సైతం సునీతకు గట్టిగానే మద్దతు లభిస్తోంది. గతంలో జూబ్లీహిల్స్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాధ్ చేసిన అభివృద్ది, నమ్మిన క్యాడర్, నమ్ముకున్న నియోజకవర్గ ఓటర్లతోపాటు భార్య సునీతపై సానుభూతి ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందనే కొండంత ఆశతో ఉన్నారు బీఆర్ ఎస్ నేతలు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీపడుతన్న నవీన్ కుమార్ యాదవ్ సైతం రాజకీయాల్లో తానేం తక్కువ కాదంటూ మొదటి నుండి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. తీవ్ర పోటీలో సైతం సీటు దక్కించుకున్న నవీన్ , సీటు ప్రకటన క్షణం నుండి నామినేషన్ వేసే వరకూ పార్టీలో సీనియర్లు, కుల పెద్దలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీసీ నేతలు ఇలా ప్రతీ ఒక్కరినీ స్వయంగా వెళ్లి కలసి ,వారి మద్దతు తీసుకున్నారు.తనకు సీటు కేటాయించుకుండా అడ్డుపడ్డ అంజన్ కుమార్ యాదవ్ , అనిల్ కుమార్ యాదవ్ లను సైతం తానే స్వయంగా వెళ్లి కలసి , వారి మెప్పుపొందరాంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు.

బీసీ కార్డ్ వాడుతున్న నవీన్ యాదవ్

ప్రతిపక్ష బీఆర్ ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కూడా నవీన్ కలిసారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. ఇలా పార్టీలతో సంబంధం లేకుండా మనోడు అనిపించుకునేలా నవీన్ వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. గతంలో రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ముఖ్యంగా ఎంఐఎం మద్దతు దండిగా ఉన్న నేపధ్యంలో గెలుపు పై గట్టి ధీమాతో ఉన్నారు నవీన్ కుమార్ యాదవ్. నామినేషన్ ముందు వరకూ శత్రువులను సైతం దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం, నామినేషన్ తరువాత ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం ముమ్మరం చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చేసిన అభివృద్ది,సానుభూతి, బీఆర్ ఎస్ బలమైన క్యాడర్ ను తట్టుకుని నవిన్ విజయం సాధిస్తారా లేదా అనేది వేచిచూడాలి.

జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ది లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ప్రచారం తీరు కాంగ్రెస్ , బీఆర్ ఎస్ కు దీటుగా కొనసాగుతోింది. గత ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ ను ఏమాత్రం అభివృద్ది చేయలేదని,బిజేపి అధికారంలోకి వస్తే ,మేం చేయబోయే అభివృద్ది రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు దీపక్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో మేము మూడవ స్దానంలో ఉన్నాం. ఇప్పుడు రెండ స్దానికిి చేరుకున్నాం. నెక్ట్స్ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎఐఎం ,కాంగ్రెస్ కలిసినా భయంలేదు. మాకు పదిశాతం ఓట్లు పెరిగితే చాలు గెలిచితీరుతామంటున్నారు. దేశంలో మోదీ అభివృద్ది , కిషన్ రెడ్డి నాయకత్వంతో గెలపు పక్కా అంటూ లెక్కలు చెప్పేస్తున్నారు. పోటీ బీఆర్ ఎస్ వర్సెస్ బీజేపి మధ్యే ఉంది. గెలిచేది బీజేపినేని, ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారం పీక్స్ కు తీసుకెళుతున్నారు లంకల దీపక్ రెడ్డి. అధికార కాంగ్రెస్ ను లైట్ తీసుకున్న బీజేపి అభ్యర్ది గెలుపు లెక్కలు పోలింగ్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెస్తాయో , లేదో వేచిచూడాలి.