హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇతర నియోజకవర్గాల నేతలు తిరుగుతూ ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపై ఎన్నికలం సంఘం సీరియస్ అయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్-లోకల్స్ (స్థానికేతరులు) ఉండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న నాన్ లోకల్స్‌పై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నాన్-లోకల్స్‌పై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు.

పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పారామిలిటరీ బలగాలను దింపినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో పాటు తొలిసారిగా డ్రోన్లు, డ్రోన్ కెమెరాలను ఎన్నికల కోసం వినియోగించినట్లు తెలిపారు. మరోవైపు, పోలింగ్‌కు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్‌లో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలను మార్చామని వెల్లడించారు.

మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆగ్రహం

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా బలవంతంగా వెనక్కి పంపడంతో, పోలీసుల తీరుపై మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా? ఇదెక్కడి దౌర్జన్యం. నా పరిస్థితే ఇలా ఉంటే.. పార్టీ నేతల పరిస్థితి ఏంటని" ఆమె ప్రశ్నించారు.

బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాగంటి సునీత ఆరోపించారు. తాము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే, పోలీసులు తమను వీడియోలు తీస్తున్నారని ఆమె పేర్కొన్నారు. "ప్రభుత్వం వారిది కాబట్టి పోలీసులు వారికి (కాంగ్రెస్‌కు) మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు" అని మాగంటి సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరారు. దీంతో ఉదయం 9 గంటల వరకు 9 శాతం పోలింగ్ నమోదుకాగా, 11 గంటలకు సంబంధించిన ఓటింగ్ శాతాన్ని ఈసీ విడుదల చేసింది. 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్‌ నమోదు అయిందని తెలిపింది.