జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా, బలమైన గొంతుకగా ఉన్న సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తల సమక్షంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న తనపై పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

రాజీనామాకు దారితీసిన పరిస్థితులు
జీవన్ రెడ్డి రాజీనామాకు ప్రధాన కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్‌ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసీన జీవన్ రెడ్డి ఓడిపోయారు. క్షేత్రస్థాయిలో తమతో పోరాడిన ప్రత్యర్థిని, తన ప్రమేయం లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ముఖ్యంగా జగిత్యాలలో ప్రత్యర్థిని చేర్చుకోవద్దని తాను ముందే హెచ్చరించినా అధిష్టానం పెడచెవిన పెట్టిందని ఆయన ఆరోపించారు.

జీవన్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు
రాజీనామా సందర్భంగా జీవన్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఇవే. ‘గత కొంతకాలంగా నేను, నా కార్యకర్తలు పార్టీలో అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాము. పార్టీ కోసం రక్తం ధారపోసిన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను. తనను సంప్రదించకుండానే తీసుకున్న నిర్ణయాలు తన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేశాయని, కష్టకాలంలో పార్టీని కాపాడిన వారికి గుర్తింపు లేదు. తీవ్రమైన బాధతో, భారమైన హృదయంతో పార్టీని వీడుతున్నాను’ అంటూ తన రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు.