<p>Nadendla Manohar Comments | గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి చోటా తాము తప్పకుండా పోటీ చేస్తామని రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గుంటూరులో నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ జనసేన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. </p>
<p>గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఆ నాడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి నిలబడ్డారని, కూటమిని బలోపేతం చేయడం కోసమే జనసైనికులు నాలుగు అడుగులు వెనక్కి వేశారని పేర్కొన్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల నాటి ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గుతామని అనుకుంటే పొరపాటని ఆయన తేల్చి చెప్పారు.</p>
<p>పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన జనసైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే, జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.</p>