Janasena Chief Pawan Kalyan | ఢిల్లీ: జనసేన పార్టీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సోమవారం నాడు (జూన్ 15న) ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం వంటి ఉన్నత సిద్ధాంతాలతో ప్రయాణిస్తున్న జనసేన పార్టీ.. జాతీయ సమగ్రత దృక్పథంతో ‘సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం’ అనే థీమ్‌తో జనసేన ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది.

జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం (12 సంవత్సరాలు) పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, రాబోయే రోజుల్లో దేశ సమైక్యతపై పార్టీ ఎటువంటి భావజాలంతో ముందుకు వెళ్లబోతోంది అనే విషయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ వేదికపై వివరించనున్నారు. అయితే ఏపీలో కాకుండా జాతీయతకు కేంద్ర బిందువైన ఢిల్లీలో ఈ కీలక భేటీ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ సమావేశం సాయంత్రం వరకు సాగనుంది.

ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి జనసేన ప్రజాప్రతినిధులతో పాటు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రాంతీయ అకాంక్షలకు విలువ ఇస్తూనే, జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ శక్తిగా ఎలా నిలబడాలనే అంశంపై.. అలాగే వర్తమాన పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల సరళిపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.