ఆదాయపు పన్ను శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ (IT Return)లను దాఖలు చేయడానికి చివరి తేదీని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువులో కేవలం ఒక్క వారం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 7 వరకు దాఖలైన రిటర్న్‌లు ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు (Annual Income Tax) పరిమితి కంటే తక్కువగా ఉంటే ITR దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి మీ పన్ను విధించదగిన ఆదాయం సున్నా అయినప్పటికీ, కొన్ని పరిస్థితులలో ITR ఫైల్ చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే, జరిమానా విధించడమే కాకుండా, ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు కూడా పంపవచ్చు.

కరెంట్ అకౌంట్లో కోటికి పైగా డిపాజిట్ చేస్తే

మీరు ఏదైనా బ్యాంకు కరెంట్ అకౌంట్లో ఒక సంవత్సరంలో ఒక కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే కనుక ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ నగదు, డిజిటల్ లావాదేవీలకు వర్తిస్తుంది. నల్లధనాన్ని (Black Money)ని అరికట్టేందుకు ఇలాంటి పెద్ద లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

విదేశీ ప్రయాణాలకు 2 లక్షలకు పైగా ఖర్చు

ఒకవేళ మీరు ఒక ఏడాదిలో చేసే విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీరు రిటర్న్ దాఖలు (ITR) చేయడం తప్పనిసరి. ఈ ఖర్చు వ్యక్తిగత యాత్రలు అయినా లేదా వ్యాపార యాత్ర అయినా ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది.

విద్యుత్ బిల్లు 1 లక్షకు పైగా ఉంటే

ఏడాదిలో మీ కరెంట్ బిల్లు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, మీ ఖర్చు, ఆదాయం మధ్య అంతరాన్ని ట్రాక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ITR ఫైల్ చేయాలి. తక్కువ సంపాదిస్తున్నప్పటికీ ఎక్కువ ఖర్చు చేసే వారిని ఈ రూల్ కవర్ చేస్తుంది.

TDS కట్ చేసినప్పుడు ITR అవసరం

ఒకవేళ మీ ఆదాయంపై సంవత్సరంలో రూ.25 వేలు లేదా అంతకంటే ఎక్కువ TDS కట్ అయితే మీరు కచ్చితంగా ITR ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు. పన్ను కడుతున్న వారు తమ ఆదాయాన్ని సరిగ్గా చూపించేలా చేయడమే దీని లక్ష్యం.

విదేశీ ఆస్తులు లేదా బ్యాంకు ఖాతాలుంటే..

మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి ఉన్నా, మీరు విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం కలిగి ఉంటే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. ITR దాఖలు చేసే సమయంలో మీరు మీ విదేశీ ఆదాయం, ఆస్తుల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఈ నియమాలను ప్రకటించిన ఆదాయం తక్కువగా ఉన్న వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచడానికి రూపొందించారు.