Irumudi Like Incident In Ongole: ఇటీవల విడుదలైన ఇరుముడి మూవీలో స్కూల్ పిల్లలను ఓ ప్రజాప్రతినిధి వద్దకు ఓ టీచర్ పంపిస్తుంది. ఇలాంటి తరహా సంఘటనే ఏపీలోని ఒంగోలులో చోటుచేసుకుంది. జరుగుమల్లి ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్ పదో తరగతి విద్యార్థిని, తొమ్మిదో తరగతి విద్యార్థిని.. సెప్టెంబరు 29న ఉదయం 11 గంటల సమయంలో ఒంగోలు గోపాల్‌నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటరావు ఇంటికి వెళ్లారు. వంట మనిషి శారద చెప్పడంతో వారిద్దరూ అక్కడికి వెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. రిటైర్డ్ ఉద్యోగి వెంకటరావు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలికలు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

అసలేం జరిగింది?

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు స్నేహితులు. వీరు జరుగుమల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ‌తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. జరుగుమల్లి బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరిద్దరూ మంగళవారం ఉదయం 11 గంటలకు జరుగుమల్లిలో ఆటో ఎక్కి ఒంగోలు గోపాల్ నగర్ ఉంటున్న డీఆర్‌‌డీఎ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరావు ఇంటికి వెళ్లారు. బీసీ హాస్టల్లో వంట చేస్తున్న శారదకు వెంకట్రావుతో పరిచయం ఉంది. శారద బాలికలకు వెంకట్రావు సెల్ నెంబర్ ఇచ్చి అక్కడికి పంపించింది. వెంకట్రావు వీరిద్దరికీ బిర్యానీ తినిపించాడు. ఆ తర్వాత తన ఫోనులో వారికి నీలి చిత్రాలు చూపించాడు. వెంకట్రావు ప్రవర్తనపై అనుమానం వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒంగోలు పార్కులో సాయంత్రం వరకు ఉండి, తిరిగి వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో బాలికలు డయల్ 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంకట్రావుని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి పోక్సో కేసు నమోదు చేశారు.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?

ఈ ఘటనపై బీసీ వెల్ఫేర్ అధికారులు ఆరా

ఈ సంఘటనపై బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, జరుగుమల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు బీసీ హాస్టల్‌లో విచారణ చేపట్టారు. వంట మనిషి శారదను బాధ్యతను నుంచి తొలగించారు. హాస్టల్ వార్డెన్ తెరెజమ్మపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్గత కమిటీ ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి తెలిపారు. శారదను, తెరేజమ్మను విచారణ కోసం జరుగుమల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్ ఒంగోలుకు తరలించారు.

Also Read:  ఏపీ స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ - 6 వారాల్లో ప్రక్రియ మొదలుపెట్టాలని హైకోర్టు ఆదేశం!