<p>Vatsavai mandal in NTR district | వత్సవాయి: ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట వ్యవహారం (Love Affair) ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తమ అమ్మాయిని తీసుకెళ్లారంటూ యువకుడి ఇంటివద్ద యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో యువతి బంధువులపై యువకుడి బంధువులు, సన్నిహితులు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల పరస్పర దాడుల్లో 6 కార్ల అద్దాలు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు కార్లు అక్కడే వదిలేసి రెండు కార్లలో యువతి బంధువులు తప్పించుకున్నారు.</p>
<p><strong>అసలేం జరిగిందంటే..</strong></p>
<p>తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరుకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ యువతికి అదివరకే వివాహం కావడంతో అసలు వివాదం మొదలైంది. కొన్ని రోజుల కిందట యువతి తాళ్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో యువతిని కిడ్నాప్ చేశారని అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు తాళ్లూరు పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడ్డారని సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని యువతి బంధువులపై యువకుడి ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఎస్సై ఉమామహేశ్వరరావు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. ఇరు వర్గీయులను దీనిపై ప్రశ్నిస్తున్నారు. </p>