Indravelli Memorial Park : గత నాలుగున్నర దశాబ్దాల క్రితం భూమి కోసం, భుక్తి కోసం, అడవిపై ఆధిపత్యం విముక్తి కోసం జరిగిన అడవి బిడ్డల పోరాటానికి సజీవ సాక్ష్యంగా ఉన్న ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి ఎట్టకేలకు అధికారికంగా గుర్తింపు లభించింది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ 1981లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలకేంద్రంలో ఆదివాసీలు నిర్వహించిన బహిరంగ సభ లక్షకుపైగా తరలివచ్చిన ఆదివాసులతో కిక్కిరిసిపోయింది. పోలీసుల నిఘా నీడన సాగిన ఈ సభలో జరిగిన ఘర్షణ క్రమంగా కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నప్పటికీ 100కుపైగా ఆదివాసులు అమరులయ్యారని ఇప్పటికి ఆదివాసీ సంఘాలు చెబుతాయి.

పోలీసు కాల్పుల్లో మరణించిన అదివాసుల గుర్తింపు చిహ్నంగా అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ సహకారంతో ఇంద్రవెల్లి స్థూపాన్ని నిర్మించారు. ప్రజావీరులు మృత్యుంజయులు పేరిట నిర్మించిన ఈ స్తూపం అనేక వివాదాలకు వేదికైంది. గతంలో ఈ స్థూపం ధ్వంసం చేయడం, తెలుపు రంగు వేయడం వంటి ఘటనలతో ఆదివాసుల అగ్రహానికి కారణం అయ్యింది. దీంతో అప్పట్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ ప్రతి ఏటా ఇంద్రవెల్లి సభను నిర్వహించేందుకు పిలుపును ఇచ్చేది. దీంతో పోలీసులు నిర్బంధం కొనసాగేది. అయినప్పటికీ కొంతమంది ఆదివాసులు స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.

1981 నుంచి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఇంద్రవెల్లికి గుర్తింపు లభించలేదు. ప్రభుత్వాలు మారినా నిర్బంధం పెరగడమే తప్ప ఆదివాసుల గోడు వినిపించుకునేవాళ్లు కరవయ్యారు. నిషేధిత విప్లవ పార్టీల పేరిట తమ ఆదివాసుల ఆత్మలకు శాంతి నిర్వహించుకునే అవకాశం కూడా కల్పించలేకుండా ప్రభుత్వాలు, పోలీసులు నిర్బంధించాయంటూ ఆదివాసులు, వారి సంఘాలు ఆరోపిస్తూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS పార్టీని నిలువరించే క్రమంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన తొలి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారు. లక్షకు పైగా జనం రావడం చూసి ఆ వేదిక మీదనే ఇంద్రవెల్లిని చారిత్రాత్మక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారు. ఈ స్మృతి వనం వద్ద ఏటా ఆదివాసి అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వపరంగా ఇంద్రవెల్లిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

ఈ స్మృతి వనాన్ని గురువారం రాష్ట్ర ఎక్సెజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ స్మృతి వనాన్ని ఆదివాసీ అమరులకు అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఆదివాసి సంఘాల నాయకులతో మాట్లాడనున్నారు. స్మృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని వివిధ రకాల మొక్కలతో అందంగా అలంకరించారు. అందమైన రూపురేఖల మధ్య ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం చూడముచ్చటగా కనిపిస్తోంది.

స్మృతి వనం లోపల ఆదివాసుల సమావేశానికి ఏర్పాటుచేసిన కమిటీ హాల్‌లో ఆదివాసుల పోరాటాల పటిమను గుర్తుచేసేలా పెయింటింగ్ వేయించారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధనకు ఆదివాసులకు నివాళులు అర్పించుకునేందుకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించి స్మృతి వనం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆదివాసులకు స్వేచ్ఛయుత నివాళులు అర్పించుకునేందుకు అవకాశం కల్పించినందుకు ఆదివాసులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.